Home Telangana నాడు తండ్రి.. నేడు కొడుకు ఎడమ కాలువకు నీళ్లివ్వండి

నాడు తండ్రి.. నేడు కొడుకు ఎడమ కాలువకు నీళ్లివ్వండి

లేకుంటే పాదయాత్ర చేస్తా!
రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్‌ ఫైర్.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రైతు ధర్నాలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2003లో నీళ్ల కోసం కేసీఆర్‌ కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశారని గుర్తుచేసిన కేటీఆర్‌.. సెప్టెంబర్‌ 14 వినాయక చవితిలోపు ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు స్పష్టమైన షెడ్యూల్‌ ఇవ్వకపోతే వేలాది మంది రైతులతో అదే మార్గంలో తాను పాదయాత్ర చేస్తానని హెచ్చరించారు. సాగర్‌లో నీరు ఉన్నా పంటలకు నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. రెండు పంటలకు నీరు అందించిన గత పరిస్థితులను గుర్తుచేస్తూ రైతు డిక్లరేషన్‌, రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతుభరోసా, రైతుబంధు, రైతుబీమా హామీల అమలుపై ప్రశ్నించారు. ఎడమ కాలువ రైతులు కాంగ్రెస్‌కు ఓటు వేయడమే తప్పయిందా అని నిలదీశారు. పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని, రైతులకు యూరియా కూడా దొరకడం లేదని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలిటెక్నిక్‌ విద్యార్థులకు కేటీఆర్‌ భరోసా

మరోవైపు పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలపైనా కేటీఆర్‌ స్పందించారు. మిర్యాలగూడకు వెళ్తున్న సమయంలో ఎంజీ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు. పాలిటెక్నిక్‌ కళాశాలల భూములు, విద్యాసంస్థల భవిష్యత్తు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలను విద్యార్థులు కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సెప్టెంబర్‌ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యలను అత్యంత ప్రాధాన్యంతో ప్రస్తావిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టబోమన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాలల విలువైన భూములపై ప్రభుత్వ వైఖరిపై విద్యార్థుల్లో ఉన్న ఆందోళనను కూడా ప్రస్తావించారు. సాంకేతిక విద్యను బలోపేతం చేయాలని, జర్మనీ తరహాలో చదువుతోపాటు పని అనుభవం కల్పించే డ్యూయల్‌ ప్రోగ్రామ్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్రాక్టీస్‌ స్కూల్స్‌ వంటి విధానాలను పరిశీలించాలని సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి తరఫున అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ గట్టిగా పోరాడుతుందని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.

 

#KTR #KTRNews #TelanganaPolitics #Miryalaguda #FarmersProtest #LeftCanal #NagarjunaSagar #WaterRelease #KTRPadyatra #RevanthReddy #TelanganaFarmers #RythuBharosa #RythuBandhu #PolytechnicStudents #BRSP