Home Telangana బీసీ మహిళ కాబట్టే వేటు వేశారా?

బీసీ మహిళ కాబట్టే వేటు వేశారా?

సురేఖ బర్తరఫ్‌పై శ్రీనివాస్‌ గౌడ్‌ ఫైర్‌.

కొండా సురేఖను తెలంగాణ కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయడంపై బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. బీసీ మహిళా నాయకురాలు కావడం వల్లే సురేఖను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలపై కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రైతు గర్జన సభలో ఆయన మాట్లాడారు. ఈ సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాల్గొన్న శ్రీనివాస్‌ గౌడ్‌.. కాంగ్రెస్‌లో పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నా వారిపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. కేవలం సురేఖ విషయంలోనే కఠిన చర్యలు తీసుకోవడం వెనుక కారణమేంటని నిలదీశారు. సొంత పార్టీ నేతలకు ఒక న్యాయం, సురేఖకు మరో న్యాయమా అంటూ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ప్రశ్నించారు.

అవినీతి ఆరోపణలపై చర్యలు ఏవి?

ప్రస్తుత కేబినెట్‌లోని కొందరు మంత్రులపై అవినీతి, కమీషన్ల ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. అలాంటి ఆరోపణలపై చర్యలు తీసుకోకుండా సురేఖను మాత్రమే పదవి నుంచి తొలగించడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలను వివిధ విధాలుగా మోసం చేస్తోందని ఆరోపించారు. పదవుల తొలగింపులో కూడా బడుగు, బలహీన వర్గాలకు చెందిన నేతలనే బలిపశువులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. సురేఖ బర్తరఫ్‌ కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ, ఒక బలమైన బీసీ మహిళా నాయకురాలికి జరిగిన అన్యాయాన్ని ప్రజలు, బీసీ వర్గాలు గమనిస్తున్నాయని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. దీంతో సురేఖ ఉద్వాసన చుట్టూ ఇప్పటికే కొనసాగుతున్న రాజకీయ వివాదానికి బీసీ కోణం కూడా చేరింది.

 

#KondaSurekha #SrinivasGoud #BCWomen #BCPolitics #TelanganaPolitics #SurekhaDismissal #BRS #RevanthReddy #TelanganaCongress #CongressGovernment #KondaSurekhaControversy