Home AP గ్రామీణ నీటికి రూ.4,053 కోట్లు! ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

గ్రామీణ నీటికి రూ.4,053 కోట్లు! ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

జల్‌ జీవన్‌ మిషన్‌కు భారీ ఊతం.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా పనులకు రూ.4,053 కోట్ల ఆమోదం లభించింది. జల్‌ జీవన్‌ మిషన్‌ 2.0 కింద 13,252 గ్రామీణ నీటి పనులను పునర్వ్యవస్థీకరించి, హర్‌ ఘర్‌ జల్‌ లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో 13,247 సింగిల్‌ విలేజ్‌ స్కీములను 7,439 పథకాలుగా రేషనలైజ్‌ చేయడానికి రూ.3,046 కోట్లు కేటాయించారు. మరో ఐదు మల్టీ విలేజ్‌ స్కీములకు రూ.1,007 కోట్లు కేటాయించారు. వీటి ద్వారా 334 గ్రామాలకు ప్రయోజనం కలగనుంది. గతంలో 2,943 పనులకు రూ.1,811 కోట్లతో జారీ చేసిన జీవోను రద్దు చేసి కొత్త విధానంలో పనులను చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది.

పొగాకు రైతులకు ధరల భరోసా

పొగాకు రైతులకు రూ.94 కోట్ల ధరల లోటు భర్తీ సాయం అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2026 సీజన్‌లో తక్కువ, నాణ్యత లోపించిన పొగాకులో 9.4 కోట్ల కిలోలను కొనుగోలు చేసి కిలోకు రూ.10 చొప్పున రైతులకు డీబీటీ ద్వారా సాయం అందించనున్నారు. టొటాపురి మామిడి 2026-27 మార్కెటింగ్‌ సీజన్‌కు ధరల మద్దతు అమలులో భాగంగా ఏపీ మార్క్‌ఫెడ్‌కు వర్కింగ్‌ క్యాపిటల్‌, స్వల్పకాలిక రుణాల సమీకరణకు అనుమతి ఇచ్చారు. ఏపీ ట్రాన్స్‌కోకు పీఎఫ్‌సీ నుంచి తీసుకునే రూ.950 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీజెన్‌కోకు పీఎఫ్‌సీ నుంచి రూ.500 కోట్లు, ఆర్‌ఈసీ నుంచి రూ.550 కోట్ల రుణాలకు కార్పొరేట్‌ గ్యారెంటీలకు కూడా ఆమోదం లభించింది. పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనులకు ధరల మార్పు లెక్కింపునకు ఎన్‌హెచ్‌పీసీ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి రూ.558 కోట్లు ఆమోదించారు.

వరద పునరుద్ధరణకు నిధులు

కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 78 వరద నష్టం పునరుద్ధరణ పనులకు రూ.6.24 కోట్లకు పైగా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆవుకు 800 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టును గతంలో ఆర్‌వీఆర్‌ ప్రాజెక్ట్స్‌కు కేటాయించిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఏపీజెన్‌కో సీలేరు విద్యుత్‌ కేంద్రాలకు ఫైర్‌ ఎన్‌ఓసీ కోసం ఫైర్‌ ప్రికాషనరీ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో 18.20 ఎకరాలు, 50.56 ఎకరాలను పారిశ్రామిక, ఎంఎస్‌ఎంఈ పార్కులకు కేటాయించేందుకు, వైఎస్సార్‌ కడప జిల్లాలో 25 ఎకరాలను పీఎం-కుసుమ్‌ పథకం కింద సోలార్‌ ప్రాజెక్టుకు కేటాయించేందుకు నిర్ణయించారు. మాచర్ల మండలం అచ్చమ్మకుంటలో కొత్త పశువైద్యశాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీనివల్ల పరిసర గ్రామాల్లోని 12,648 పశువులు, కోళ్లకు సేవలు అందనున్నాయి.

 

#APCabinet #ChandrababuNaidu #AndhraPradesh #JalJeevanMission #JalJeevanMission2 #RuralWaterSupply #HarGharJal #APDevelopment #TobaccoFarmers #APMarkfed #APTransco #APGenco #Polavaram #FloodRestoration #PumpedStorage #MSMEParks #APPolitics #AndhraPradeshNews