దేశం కోసం సైకిల్‌ తొక్కిన మనోహరుడు.. మూలాలను మరవని దేవాంగ ధీరుడు.. వ్యాపారం నుంచి సామాజిక బాధ్యత వరకు

DV Manohar: From Business Success to Cycling Revolution

చిన్న పరిశ్రమ నుంచి జాతీయ విధానం వరకు

చేనేత కుటుంబం నుంచి వ్యాపార శిఖరాలకు.. అక్కడి నుంచి సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ వరకు సాగిన అసాధారణ ప్రస్థానం డీవీ మనోహర్‌ది. చేతిలో పెట్టుబడి లేదు.. కానీ ఏదో సాధించాలన్న సంకల్పం ఉంది. 1975లో రూ.72 వేలతో ప్రారంభమైన చిన్న కుటీర పరిశ్రమ.. డీప్‌వెల్‌ హ్యాండ్‌ పంపులు, శక్తి గ్యాస్‌, హాస్పిటాలిటీ రంగాల మీదుగా విస్తరించింది. వ్యాపారంలో విజయాలు సాధించినా.. విజయగర్వం తలకెక్కకుండా తన మూలాలను మరవని వ్యక్తిత్వం ఆయనది. దాదాపు నాలుగు దశాబ్దాల విరామం తర్వాత సైకిల్‌ ఎక్కి.. లండన్‌–పారిస్‌ సవాల్‌ను పూర్తి చేసిన ఆయన, వ్యక్తిగత అభిరుచిని సామాజిక ఉద్యమంగా మలిచారు. హైదరాబాద్‌ బైసిక్లింగ్‌ క్లబ్‌ను బలమైన సైక్లింగ్‌ కమ్యూనిటీగా తీర్చిదిద్దారు. వరల్డ్‌ సైక్లింగ్‌ అలయన్స్‌లో ఆసియా నుంచి కీలక నాయకత్వ స్థానాన్ని అందుకున్నారు. స్మార్ట్‌బైక్‌ ద్వారా పబ్లిక్‌ బైక్‌ షేరింగ్‌ను దేశానికి పరిచయం చేసి, సైక్లింగ్‌ను ఆరోగ్యంతో పాటు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు ఆయుధంగా మార్చారు. ఇప్పుడు జాతీయ సైక్లింగ్‌ విధానానికి రూపకల్పన చేసే స్థాయికి ఎదిగారు. మరోవైపు కోవిడ్‌ సమయంలో పేదలకు అండగా నిలిచి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లల కోసం పీడియాట్రిక్‌ ఐసీయూలు, కంటి వైద్య సేవలకు సహకారం అందించారు. సంపదను సంపాదించడం కంటే.. సమాజానికి తిరిగి ఇవ్వడమే నిజమైన విజయమని తన చేతలతో చాటిన మనోహర్‌ జీవితం ఒక వ్యక్తి కథ కాదు.. ఒక స్ఫూర్తి చరిత్ర.

డీవీ మనోహర్ హిస్టరీ… అసామాన్య విక్టరీ

చేతిలో డబ్బుల్లేవు. పెట్టుబడులు లేవూ. కానీ ఏదో సాధించాలనే సంకల్పం మాత్రం ఆయనను ముందుకు నడిపించింది. అందుకే, చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం కాకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేశారు డీవీ మనోహర్‌. పారిశ్రామికవేత్తగా ఎదగాలనే తపనతో 1975లో స్వయం ఉపాధి పథకం కింద స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.62 వేల రుణం, తల్లిదండ్రుల నుంచి మరో రూ.10 వేల సాయంతో చిన్న కుటీర పరిశ్రమను ప్రారంభించారు. అక్కడి నుంచి డీప్‌వెల్‌ హ్యాండ్‌పంపుల తయారీతో వ్యాపార ప్రస్థానాన్ని మొదలుపెట్టి, అనంతరం ఎల్పీజీ రంగంలోకి ప్రవేశించారు. శక్తి గ్యాస్‌ సంస్థను స్థాపించి దేశంలోని ప్రముఖ ప్రైవేట్‌ ఎల్పీజీ సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. హోటల్‌ రంగంలోనూ అడుగుపెట్టి లగ్జరీ హోటళ్లను అభివృద్ధి చేశారు. ఇలా ఒక్కో రంగంలో తనదైన ముద్ర వేస్తూ ఎదిగిన ఆయన ప్రయాణం చివరకు స్మార్ట్‌ అండ్‌ సస్టైనబుల్‌ మొబిలిటీ వైపు మళ్లింది. ఆరోగ్య సమస్యల సమయంలో వైద్యుల సూచనతో దాదాపు నాలుగు దశాబ్దాల విరామం తర్వాత మళ్లీ సైకిల్‌ ఎక్కిన మనోహర్‌, ప్రారంభంలో ఎదురైన కష్టాలను అధిగమించి లండన్‌–పారిస్‌ సైక్లింగ్‌ సవాలును పూర్తి చేశారు. ఆ అనుభవం ఆయనను అంతర్జాతీయ సైక్లింగ్‌ వేదికపైకి తీసుకెళ్లింది. అక్కడి నాయకత్వ అనుభవాన్ని భారతదేశానికి తీసుకొచ్చి పబ్లిక్‌ బైక్‌ షేరింగ్‌, స్మార్ట్‌బైక్‌ వ్యవస్థల విస్తరణకు కృషి చేశారు. సైక్లింగ్‌ను ఆరోగ్యానికే పరిమితం చేయకుండా కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన రవాణాకు కీలక సాధనంగా భావించి జాతీయ సైక్లింగ్‌ విధాన రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. వ్యాపార విజయాన్ని దాటి సమాజ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను జీవిత ధ్యేయంగా ఎంచుకున్న మనోహర్‌ ప్రస్థానం సంకల్పం ఉంటే సాధారణ ఆరంభం నుంచే అసాధారణ మార్పుకు బాటలు వేయవచ్చని నిరూపిస్తోంది.

వ్యక్తిగత అనుభవమే సైక్లింగ్‌కు కారణం
స్మార్ట్‌బైక్‌ ఆలోచన వెనుక ఒక వ్యక్తిగత అనుభవం ఉందని మనోహర్ చెబుతారు. సుమారు 15 ఏళ్ల క్రితం ఆరోగ్య సమస్యలు ఎదురైన సమయంలో వైద్యులు పని ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించారు. అయితే పని లేకుండా ఉండటం తన వల్ల కాదని నిర్ణయించుకున్న ఆయన సైక్లింగ్‌పై పరిశోధన చేశారు. సైక్లింగ్ శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాకుండా జీవనశైలికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో ఉపయోగపడుతుందని తెలుసుకుని, సుమారు 55 ఏళ్ల వయసులో దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సైకిల్ ఎక్కారు. సైక్లింగ్ ప్రారంభించిన రోజునే సైకిల్‌పై నుంచి పడిపోయానని మనోహర్ చెప్తారు. ఆ నాడే.. తాను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. లండన్‌ నుంచి పారిస్‌ వరకు సైకిల్‌పై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది ప్రపంచంలోని కఠినమైన సైక్లింగ్ మార్గాల్లో ఒకటిగా ఆయన పేర్కొన్నారు. వ్యాపార బాధ్యతలు కొనసాగిస్తూనే ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి సాధన ప్రారంభించానని ఆయన గుర్తు చేస్తారు. మొదట 20 కిలోమీటర్లు, తర్వాత 30, 50, 100 కిలోమీటర్లు దిశగా సాధన చేశారు. లండన్‌–పారిస్‌ ప్రయాణంలో రోజుకు సుమారు 150 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాల్సి ఉండటంతో, తొమ్మిది నెలల్లో ఆ గోల్ రీచ్ అయ్యారు. కుటుంబ సభ్యులు కూడా ఆయనకు తోడుగా సైక్లింగ్ చేపట్టారు. భార్య ఎస్కార్ట్ కారులో వెంట నడవగా.. కొడుకు, కుమార్తె సాయంతో ఆ సవాలును విజయవంతంగా పూర్తి చేయడంతో, తనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందంటారు.

ఆసియా నుంచి తొలిసారి అవకాశం
60 ఏళ్లు పూర్తయ్యే సమయంలో మరోసారి తన శారీరక సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈసారి తీవ్ర వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా సైక్లింగ్‌ను ఆపలేదు. ఆ సవాలును కూడా విజయవంతంగా పూర్తి చేయడంతో అంతర్జాతీయ సైక్లింగ్ వర్గాల్లో ఆయనకు మరింత గుర్తింపు తెచ్చింది. అంతర్జాతీయ సైక్లింగ్ రంగంలో ఆయనకు వరల్డ్ సైక్లింగ్ అలయన్స్‌లో బోర్డు సభ్యుడిగా అవకాశం లభించింది. ఆసియా నుంచి ఆ స్థానాన్ని పొందిన తొలి వ్యక్తిగా నిలిచానని మనోహర్ గర్వంగా చెబుతారు. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్‌గా, అనంతరం తొలి ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. నాలుగేళ్లుగా ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మనోహర్. ఈ బాధ్యతల్లో పనిచేస్తున్న సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో సైక్లింగ్ అభివృద్ధి తీరును దగ్గరగా పరిశీలించే అవకాశం లభించిందన్నారు.

సైకిల్ వెనుక అసలు లక్ష్యం
అంతర్జాతీయ అనుభవంతో భారతదేశంలోనూ సైక్లింగ్‌ను భారీగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనే ఆలోచన బలపడిందని మనోహర్ చెప్పారు. ఒకవైపు సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని… మరోవైపు వాహనాల కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని కుండబద్ధలుకొడతారు. నగరాల్లో వాయు కాలుష్యం ప్రజల ఆయుష్షును గణనీయంగా తగ్గిస్తోందన్న అధ్యయనాలను పరిశీలించిన తర్వాత ఈ అంశాన్ని తన సామాజిక బాధ్యతగా తీసుకున్నానని తెలిపారు. ఆయన సమర్పించిన జాతీయ సైక్లింగ్ విధాన ముసాయిదాలో కూడా కాలుష్యం, ఆరోగ్యం, స్థిరమైన రవాణా అంశాలకు ప్రధాన ప్రాధాన్యం ఇచ్చారు. సైక్లింగ్‌ను ప్రజల రోజువారీ రవాణాలో భాగం చేయాలంటే సైకిళ్లు అందుబాటులో ఉండాలని భావించిన మనోహర్ పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్‌ను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు కృషి చేశారు. కొత్త కాన్సెప్ట్ కావడంతో మొదట్లో బ్యాంకులు, ఫండింగ్ సంస్థలు ముందుకు రాలేదని చెప్పారు. దీంతో సొంత నిధులతో ఢిల్లీ, చెన్నై, చండీగఢ్, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ వ్యవస్థను ప్రారంభించనన్నారు. అనంతరం రక్షణ రంగం కూడా ఈ విధానాన్ని అమలు చేసిందన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈ కార్యక్రమాన్ని అభినందించి ప్రారంభించారని మనోహర్ తెలిపారు. అనంతరం నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ ఇండియా, ఢిల్లీలోని డిఫెన్స్ వ్యవస్థకు చెందిన సంస్థలు, కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్, మిలిటరీ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రక్షణ వ్యవస్థల్లోనూ స్మార్ట్‌బైక్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు.

కాశీ నుంచి విశాఖ వరకు విస్తరణ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 10 వేల స్మార్ట్‌బైక్‌లు ఉన్నాయని మనోహర్ తెలిపారు. సాధారణ సైకిళ్ల కంటే ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్‌బైక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. స్మార్ట్‌బైక్‌ను ఉపయోగించేందుకు ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేశామన్నారు. యాప్ అభివృద్ధికి సుమారు రూ.3 కోట్లు ఖర్చు చేశామన్నారు. యాప్ ద్వారా సైకిల్‌ను తీసుకోవడం, రైడ్ పూర్తి చేసిన తర్వాత మరో స్టేషన్‌లో తిరిగి అప్పగించడం, ఆన్‌లైన్‌లో చార్జీలు చెల్లించడం వంటి సదుపాయాలు ఉన్నాయి. స్మార్ట్‌బైక్‌పై ప్రయాణించే సమయంలో ఎన్ని ఎత్తుపల్లాలు దాటారు, ఎంత దూరం ప్రయాణించారు, ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి వంటి వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక స్టేషన్‌లో సైకిల్ తీసుకుని మరో స్టేషన్‌లో తిరిగి ఇచ్చే విధానం వల్ల ప్రజలకు సౌకర్యవంతమైన ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కల్పించవచ్చని పాలసీ ముసాయిదా కూడా సూచిస్తోంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో స్మార్ట్‌బైక్ పబ్లిక్ బైక్ షేరింగ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామని మనోహర్ తెలిపారు. టెండర్లు గెలుచుకుని అక్కడ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. తదుపరి విశాఖపట్నంలోనూ ఈ వ్యవస్థను అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ విస్తరణతో తమ సంస్థ దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ బైక్ షేరింగ్ కంపెనీగా గుర్తింపు పొందిందని చెప్పారు. దేశంలోని 100 స్మార్ట్ సిటీల్లో చండీగఢ్ పబ్లిక్ బైక్ షేరింగ్ ప్రాజెక్ట్‌ను అత్యుత్తమ ప్రాజెక్ట్‌గా గుర్తించి అవార్డు లభించిందని మనోహర్ తెలిపారు. స్టార్టప్ ఇండియా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లభించిన అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మనోహర్ అందుకున్నారు. ఇది స్మార్ట్ మొబిలిటీ రంగంలో తమ ప్రయాణానికి మరో కీలక గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.

ప్రధాని ముందుకు జాతీయ సైక్లింగ్ విధానం
స్టార్టప్ రంగానికి చెందిన వివిధ రంగాల ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడిన కార్యక్రమంలో స్మార్ట్ అండ్ సస్టైనబుల్ మొబిలిటీ రంగం నుంచి స్మార్ట్‌బైక్‌కు అవకాశం లభించిందని మనోహర్ తెలిపారు. ఆ అవకాశంతో తనయుడు ధర్మిన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఆ సమయంలో జాతీయ సైక్లింగ్ పాలసీ, ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ మౌలిక వసతులు, సైక్లింగ్ ప్రోత్సాహకాలు అవసరమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆ రోజే, జాతీయ సైక్లింగ్ పాలసీ తీసుకువస్తామని ప్రధాని చెప్పారని ఆయన గుర్తుచేశారు. జాతీయ సైక్లింగ్ పాలసీపై జాప్యం జరుగుతుండటంతో కేంద్రంతో ఫాలో అప్ చేశానని మనోహర్ తెలిపారు. తనకు ఉన్న అనుభవం, సైక్లింగ్ రంగంపై అవగాహన దృష్ట్యా తననే పాలసీని రూపొందించాలని మంత్రిత్వ శాఖ సూచనలు చేసిందన్నారు. దాంతో నేషనల్ సైక్లింగ్ పాలసీ డ్రాఫ్ట్‌తో పాటు ప్రధానమంత్రి స్థాయిలో వివరించేందుకు ప్రత్యేక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించానన్నారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మనోహర్ ప్రతిపాదించిన విధానంలో 2030 నాటికి తక్కువ దూర ప్రయాణాలకు సైకిల్‌ను సహజ ఎంపికగా మార్చడం, రవాణాలో సైక్లింగ్ వాటాను 25 శాతానికి పెంచడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. కాలుష్యం తగ్గింపు, రహదారి భద్రత, ఆరోగ్యం, సమానత్వం, స్థిరమైన రవాణా వంటి అంశాలను ఇందులో కలిపారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని మనోహర్ ప్రతిపాదించారు. ట్రాఫిక్ నుంచి సైక్లిస్టులను రక్షించేలా బారికేడ్లతో ట్రాక్‌లు ఉండాలని సూచించారు. మాల్స్, హోటళ్లు, థియేటర్లు, కార్యాలయాలు, షాపింగ్ ప్రాంతాలు వంటి అన్ని చోట్ల ప్రత్యేక సైకిల్ పార్కింగ్ తప్పనిసరి చేయాలని కోరారు. ప్రతి ఆదివారాన్ని ‘సైక్లింగ్ సండే’గా నిర్వహించి ప్రజలను సైక్లింగ్ వైపు మళ్లించాలని కూడా ప్రతిపాదించారు.

పాఠశాల నుంచే సైక్లింగ్ అలవాటు
పాఠశాలలు, కళాశాలల నుంచే సైక్లింగ్ సంస్కృతిని పెంచాలని ఆయన ప్రతిపాదించారు. విద్యార్థులు సైకిళ్లపై విద్యాసంస్థలకు వెళ్లేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. సైక్లింగ్‌కు విద్యార్థులకు క్రెడిట్లు ఇవ్వాలి. సురక్షిత సైక్లింగ్ మార్గాలు, పార్కింగ్, సైకిల్ నైపుణ్యం, రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సైక్లింగ్ మౌలిక వసతుల కోసం కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ నిధుల్లో 10 శాతం వినియోగించాలని ముసాయిదా ప్రతిపాదించింది. సైక్లింగ్‌కు సంస్థలు చేసే ఖర్చును వ్యాపార వ్యయంగా పరిగణించి పన్ను ప్రయోజనాలు కల్పించాలని సూచించింది. సైకిల్ టు వర్క్ కార్యక్రమాల్లో ఉద్యోగులకు సైకిల్ అలవెన్సులు, వడ్డీలేని రుణాలు, నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించింది. మనోహర్ దృష్టిలో సైక్లింగ్ అనేది కేవలం ఆరోగ్య కార్యక్రమం కాదు. నగరాల్లో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది కీలకమైన పరిష్కారాల్లో ఒకటి. 2023 నాటికి దేశంలో 37.67 కోట్ల వాహనాలు ఉండగా, ఏటా మరో రెండు కోట్లకు పైగా వాహనాలు చేరుతున్నాయని ఆయన పాలసీ ముసాయిదా పేర్కొంది. తక్కువ దూరాలకు సైక్లింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించవచ్చని అందులో స్పష్టం చేశారు.

కోవిడ్‌ను మించిన భూతం వాయు కాలుష్యం
కోవిడ్‌ సమయంలో రెండేళ్లలో సుమారు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోతే.. ప్రపంచం మొత్తం తీవ్రంగా స్పందించిందంటారు డీవీ మనోహర్. ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయని, మనకు అంతగా కనిపించని వాయు కాలుష్యం కారణంగా, ఏటా 22 లక్షల మంది మరణిస్తున్నా, కోవిడ్‌ సమయంలో చూపించిన స్థాయి శ్రద్ధ, ముందస్తు హెచ్చరికలు కనిపించడం లేదంటారాయన. ఈ పరిస్థితిని మార్చాలని.. పౌరుల ఆయుర్దాయం తగ్గకుండా చూడాలన్నది ఆయన ఉద్దేశం. కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న లక్షలాది మందిని కాపాడాలని… ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానంటారు డీవీ మనోహర్‌. ప్రజల ప్రాణాలు కాపాడాలన్న సంకల్పంతో.. పర్యావరణ పరిరక్షణను తన జీవిత లక్ష్యంగా భావిస్తున్నానన్నారు. ప్రజల ఆరోగ్యం, భవిష్యత్‌ తరాల భద్రత కోసం కాలుష్య నియంత్రణపై ప్రభుత్వాలు, సమాజం మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. పట్టణ ప్రజల ఆయుర్దాయం తగ్గకుండా చూడటం, కాలుష్యం కారణంగా ప్రాణనష్టం తగ్గించడం తన జీవిత మిషన్‌గా పెట్టుకున్నానని స్పష్టం చేశారు.

పిల్లల కోసం పీడియాట్రిక్ ఐసీయూలు
తన వ్యాపార ప్రస్థానంలో సంపాదన ఒక్కటే లక్ష్యం కాదని మనోహర్ చెబుతారు. తనకు సరిపడేంత ఆదాయం వస్తే చాలనేది తన ఆలోచన అని, మిగిలిన సామర్థ్యాన్ని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పెట్టాలని భావిస్తానని తెలిపారు. వ్యాపారంలో తనతో కలిసి పనిచేసిన కొందరు వందల, వేల కోట్ల సంపద సంపాదించినా, తనకు మాత్రం సామాజిక సేవకు ప్రాధాన్యం ఇవ్వడమే ముఖ్యమన్నారు. కోవిడ్ సమయంలో ఎలాంటి ప్రచారం లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలు, పట్టణాల్లో పేదలకు నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమాలు చేపట్టామన్నారు మనోహర్. స్థానికంగా నమ్మకమైన వ్యక్తులను గుర్తించి వారికి నిధులు అందించడం ద్వారా అవసరమైన కుటుంబాలకు సరుకులు చేరేలా చేశామని చెప్పారు. సేవను ప్రచారంగా కాకుండా బాధ్యతగా చూడటం తమ కుటుంబ విధానమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు దొంతంశెట్టి అప్పారావు, త్రినాథవేణి పేరుతో ఏర్పాటు చేసిన వేణురావు ఫౌండేషన్ ద్వారా పది నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీడియాట్రిక్ ఐసీయూలను ఏర్పాటు చేశామని మనోహర్ తెలిపారు. పెద్దలకు ఐసీయూలు అందుబాటులో ఉన్నా, చిన్నపిల్లలకు అలాంటి సదుపాయాలు తక్కువగా ఉండటాన్ని గమనించి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కోవిడ్ సమయంలో పిల్లలకు అత్యవసర చికిత్స అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఈ సదుపాయాలను ఏర్పాటు చేశామని వివరించారు.

ఎల్‌వీ ప్రసాద్ సంస్థకు సహకారం
రాజమండ్రిలో పేదలకు సేవలందిస్తున్న కంటి ఆసుపత్రికి మొబైల్ ఐ క్లినిక్‌ల కోసం బస్సులను సమకూర్చినట్లు తెలిపారు. ఈ బస్సుల ద్వారా మారుమూల గ్రామాలు, పట్టణాలకు వెళ్లి కంటి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆసుపత్రి కొత్త కాంప్లెక్స్, ఆపరేషన్ థియేటర్ నిర్మాణానికి కూడా సహకరించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన కొత్త కాంప్లెక్స్‌లో ఆపరేషన్ థియేటర్‌కు తమ కుటుంబం తరఫున సహకారం అందించామని మనోహర్ తెలిపారు. తల్లిదండ్రుల పేరుతో ఆ ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సేవా కార్యక్రమాలన్నింటిలోనూ ప్రచారం పొందాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. 1975లో చిన్న పరిశ్రమతో ప్రారంభమైన డీవీ మనోహర్ వ్యాపార ప్రయాణం ఎల్పీజీ, హోటళ్లు, స్మార్ట్ మొబిలిటీ వరకు సాగింది. వ్యక్తిగత అనుభవంతో సైక్లింగ్‌ను స్వీకరించి, అక్కడి నుంచి అంతర్జాతీయ సైక్లింగ్ రంగంలో నాయకత్వ స్థానానికి ఎదిగారు. ఆ అనుభవాన్ని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చి పబ్లిక్ బైక్ షేరింగ్, స్మార్ట్‌బైక్, జాతీయ సైక్లింగ్ పాలసీ వంటి ఆలోచనలకు రూపం ఇచ్చారు. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణను తన జీవిత ధ్యేయంగా భావించి పనిచేస్తున్నానని ఆయన చెబుతున్నారు. అదే ఆయన వ్యాపార ప్రస్థానానికి సామాజిక అర్థాన్ని ఇచ్చిన అసలు కథ.