Home General సింధు జల ఒప్పందంపై భారత్‌ తేల్చేసింది

సింధు జల ఒప్పందంపై భారత్‌ తేల్చేసింది

హేగ్ తీర్పును తిరస్కరించిన భారత్‌

సింధు జల ఒప్పందంపై హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్‌ తీవ్రంగా తిరస్కరించింది. ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకునే అధికారం ఆ సంస్థకు లేదని స్పష్టం చేసింది. సింధు జల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని, ఒప్పందాన్ని కొనసాగించాలని కోర్టు చేసిన సూచనలను భారత్‌ అంగీకరించలేదు. 1960 సెప్టెంబర్‌లో భారత్‌-పాకిస్థాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం సింధు నదీ వ్యవస్థలోని జలాల పంపకాన్ని నియంత్రిస్తుంది. అయితే గతేడాది ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత్‌ పాకిస్థాన్‌పై పలు కఠిన చర్యలు తీసుకుంది. అందులో భాగంగా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అప్పటి నుంచి “రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు” అన్న తన వైఖరిని భారత్‌ పదేపదే స్పష్టం చేస్తోంది.

ఉగ్రవాదంపై చర్యలే షరతు

భారత విదేశాంగ శాఖ తాజాగా ఇచ్చిన ప్రకటనలో హేగ్‌ సంస్థను తీవ్రంగా తప్పుబట్టింది. ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ మధ్యవర్తిత్వ సంస్థ ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైందని భారత్‌ ఆరోపించింది. గతంలోనూ ఈ సంస్థ చేసిన ప్రకటనలను భారత్‌ గుర్తించలేదని తెలిపింది. అంతేకాదు, ఈ సంస్థ ముందు భారత్‌ హాజరు కాలేదని, దాని గత నిర్ణయాలను కూడా పట్టించుకోలేదని స్పష్టం చేసింది. భారత్‌ తీసుకున్న సార్వభౌమ నిర్ణయాలపై తీర్పులు ఇచ్చే అధికారం ఈ సంస్థకు లేదని విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. పాకిస్థాన్‌ భూభాగం నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలించేందుకు విశ్వసనీయమైన, తిరుగులేని చర్యలు తీసుకునే వరకు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్‌ స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రాజెక్టులు సహా సింధు జలాల విషయంలో భారత్‌ తీసుకునే చర్యలపై హేగ్‌ సంస్థ తాజా తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యూఢిల్లీ తేల్చిచెప్పింది.

 

#IndusWatersTreaty #IndiaPakistan #HagueVerdict #PermanentCourtOfArbitration #IndiaRejectsVerdict #IndusWaters #IndiaPakistanWaterDispute #PahalgamAttack #PakistanTerrorism #IndiaForeignMinistry #IndusRiver #IndiaPakistanRelations #BreakingNews