పిల్లల సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్ వినియోగంపై నియంత్రణకు బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేశారు. ‘సేఫ్గార్డింగ్ హెల్తీ ఇంటర్నెట్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ లిటిల్ డిజిటల్-నేటివ్స్’ పేరుతో రూపొందించిన షీల్డ్ బిల్లు-2025 ఆగస్టు 7న లోక్‌సభ జాబితాలోకి వచ్చింది. అయితే సభ ముందుగానే వాయిదా పడటంతో బిల్లు ప్రవేశపెట్టడం సాధ్యం కాలేదు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం 13 ఏళ్లలోపు పిల్లలు ధ్రువీకరించిన తల్లిదండ్రుల అనుమతి లేకుండా సోషల్ మీడియా లేదా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఖాతా తెరవకూడదు. ప్రతి ఆన్లైన్ సంస్థ తల్లిదండ్రులకు ప్రత్యేక కంట్రోల్ డ్యాష్‌బోర్డ్ అందించాలి. దీని ద్వారా పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడం, ప్రైవసీ సెట్టింగులను నియంత్రించడం, స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేయడం సాధ్యమవుతుంది.
హానికర కంటెంట్‌పై కఠిన చర్యలు
పిల్లలకు హాని కలిగించే కంటెంట్‌పై కూడా బిల్లు కఠిన నిబంధనలు ప్రతిపాదిస్తోంది. తల్లిదండ్రులు లేదా ఇతరులు ఫిర్యాదు చేసిన హానికర కంటెంట్‌ను పరిశీలించిన తర్వాత 36 గంటల్లో తొలగించాలి. పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్ అయితే 24 గంటల్లోనే తొలగించాల్సి ఉంటుంది. ప్రతి యాప్‌లో ‘రిపోర్ట్ చైల్డ్ హార్మ్’ అనే ప్రత్యేక ఫిర్యాదు బటన్ ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా లేదా పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే సేవలను నిలిపివేయడం, బ్లాక్ చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు. పిల్లల భద్రతపై ప్రతి సంవత్సరం రిస్క్ అసెస్మెంట్ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని బిల్లు సూచిస్తోంది. సోషల్ మీడియా ద్వారా పిల్లలపై ప్రభావం, వ్యసన ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.
#SHIELDBill2025 #KidsSocialMedia #ChildOnlineSafety #ParentalConsent #OnlineGaming #SocialMediaRegulation #ChildSafety #DigitalSafety #OnlineProtection #BaijayantPanda #LokSabha #PrivateMemberBill #ChildrenOnline #InternetSafety #SocialMediaBill











