శివకుమార్ మృతిపై పోస్టుల కలకలం.. డీఐజీకి ఫిర్యాదు
దివంగత చింతల శివకుమార్ మృతికి సంబంధించి సోషల్ మీడియాలో కొందరు తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులు చేస్తున్నారని యల్లటూరు శ్రీనివాస రాజు ఆరోపించారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీకి, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్‌కు ఫిర్యాదు చేశారు. శివకుమార్ మృతి ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ కొనసాగుతున్న సమయంలోనే దురుద్దేశపూర్వక ప్రచారం జరుగుతోందని శ్రీనివాస రాజు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫేస్‌బుక్ వంటి వేదికల్లో తనపై తప్పుడు ఆరోపణలతో పోస్టులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపణ
తన ప్రతిష్ఠ, ప్రజాదరణను దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు కొందరు వ్యక్తులను ప్రభావితం చేస్తున్నారని శ్రీనివాస రాజు ఆరోపించారు. నిజమైన ఆరోపణలు ఉంటే వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా నేరుగా దర్యాప్తు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను సృష్టించడం, ప్రచారం చేయడం, షేర్ చేయడంలో పాల్గొన్న వారిని గుర్తించాలని డీఐజీని కోరారు. BNS, వర్తించే సైబర్ చట్టాలు, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోస్టులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను భద్రపరిచి, వాటి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించాలని కోరారు.
పరువు నష్టం కేసులకు సిద్ధం
తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం కేసులు ప్రారంభించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస రాజు తెలిపారు. శివకుమార్ మృతి విచారణకు తన పూర్తి సహకారం ఉంటుందని, విచారణ పారదర్శకంగా నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.


Srinivasa Raju, Chintala Shivakumar, Kurnool, Kadapa, Social Media Posts, False Information, Defamation, Cyber Crime, Police Complaint, Kurnool DIG, Kadapa SP, Andhra Pradesh Police, BNS, Digital Evidence, Social Media, Defamatory Posts, Shivakumar Death Case











