ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గంజాయి విక్రయాలు, కల్తీ మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో గంజాయి విక్రయాలు విస్తృతంగా జరుగుతున్నాయని, ఈ పరిస్థితి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలోనే అక్రమ కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని రాచమల్లు ఆరోపించారు. నియోజకవర్గంలో కొత్తగా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారని, గంజాయితో పాటు కల్తీ మద్యం విక్రయాలు కూడా జరుగుతున్నాయని విమర్శించారు.

గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి తమ బంగారంలాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఈ పరిస్థితిని తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. గంజాయి విక్రయాలపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే వైసీపీ తరఫున నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.ఒకవైపు గంజాయి విక్రయాలను అరికట్టాలని తాము డిమాండ్ చేస్తుంటే, తమపైనే విచారణ జరపాలని కూటమి నాయకులు పోలీసు అధికారులను ఆశ్రయిస్తున్నారని రాచమల్లు మండిపడ్డారు. అయితే ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని, ప్రజలే ఈ ప్రభుత్వానికి గోరి కడతారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.











