డీఎస్సీ రిక్రూట్మెంట్‌పై గవర్నర్‌కు నేడు వైసీపీ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాళ్లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే, ఎలాంటి తప్పులు జరగలేదని భావిస్తే ఈ వ్యవహారంపై తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేవనెత్తిన సాంకేతిక, పరిపాలనాపరమైన ప్రశ్నలలో ఒక్కదానికైనా మంత్రి లోకేశ్ సమాధానం చెప్పలేకపోయారని విమర్శించారు. కేవలం అక్రమాలను పక్కదారి పట్టించేందుకే తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోకి వచ్చానంటూ లోకేశ్ సరికొత్త జిమ్మిక్కులకు తెరలేపారని కన్నబాబు ఎద్దేవా చేశారు.
బాధిత అభ్యర్థులతో మాట్లాడే ధైర్యం ఉందా
ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చిన వారిని బెదిరించి, తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో వైఎస్ జగన్ పై తిట్టించడం కాదని కన్నబాబు హితవు పలికారు. నిజంగా మెరిట్ మార్కులు సాధించి కూడా ఉద్యోగాలు కోల్పోయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వందలాది మంది దగాపడ్డ అభ్యర్థులతో విద్యాశాఖ మంత్రి సమావేశం ఏర్పాటు చేయాలని సవాల్ విచ్చారు. పరీక్షల నిర్వహణ నుండి ఫలితాల వెల్లడి వరకు ఎక్కడా పారదర్శకత పాటించలేదని జీవోలతో సహా తమ పార్టీ నిరూపించిందని గుర్తు చేశారు. సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి కూడా ఉద్యోగాలు ఇవ్వని వైనాన్ని, స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలను నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ డీఎస్సీ అక్రమాలపై గురువారం వైకాపా నాయకులు గవర్నర్‌ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
లోకేశ్‌ను మందలించే శక్తి చంద్రబాబుకు లేదు
రాష్ట్రంలో ఒకవేళ నారా లోకేశ్ స్థానంలో మరే ఇతర నాయకుడు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఉంటే ఈ పాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవారని కన్నబాబు పేర్కొన్నారు. సదరు మంత్రిని పదవి నుండి తొలగిస్తున్నట్లు అనుకూల పత్రికలలో బ్రేకింగ్ వార్తలు వచ్చేవి కానీ సొంత కొడుకును పిలిచి మందలించే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదని వారి సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారని తెలిపారు. వీకెండ్ వస్తే పొరుగు రాష్ట్రానికి వెళ్లే లోకేశ్, తెలంగాణలో ఆధార్ కార్డు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడదని, బాధితుల గొంతుకగా నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.










