Home General మంచి రోజులొచ్చేశాయ్! మోగనున్న పెళ్లి బాజాలు

మంచి రోజులొచ్చేశాయ్! మోగనున్న పెళ్లి బాజాలు

48

ఆర్థిక సవాళ్లతో ఇబ్బందులు

పెళ్లి అంటే ప్రతి తల్లిదండ్రి జీవితంలో ఒక మధురమైన కల. తమ పిల్లల పెళ్లిని ఘనంగా జరిపించాలని ప్రతి కుటుంబం ఆశపడుతుంది. నెలన్నర రోజుల విరామం తర్వాత మళ్లీ శుభముహూర్తాలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలైంది. కానీ పెళ్లి బాజాలు మోగే వేళ తల్లిదండ్రుల గుండెల్లో మాత్రం ఖర్చుల మోత మోగుతోంది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, డెకరేషన్, రవాణా ఖర్చులు భారీగా పెరగడం కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు పిల్లల పెళ్లి ఆనందం, మరోవైపు లక్షల రూపాయల అదనపు భారం వారిని కలవరపెడుతోంది. జీవితంలో ఒక్కసారే వచ్చే ఈ శుభకార్యాన్ని సంతోషంగా జరుపుకోవాలన్న తపన ఉన్నా, పెరుగుతున్న ఖర్చులు చాలా మందిని అప్పుల బాట పట్టిస్తున్నాయి. పెళ్లి వేడుకల సందడి కనిపిస్తున్నా, ఆ వెలుగుల వెనుక ఎన్నో కుటుంబాల ఆవేదన దాగి ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. గత నెలన్నర రోజులుగా శుభకార్యాలు ఆగిపోయాయి. అధిక జ్యేష్ఠ మాసం వల్ల పెళ్లిళ్లు జరగలేదు. ఇప్పుడు నిజ జ్యేష్ఠ మాసం ప్రవేశించింది. జూన్ 18 నుంచి జులై 9 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. సమయం చాలా తక్కువగా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఆషాఢమాసం, గురుమూఢం వస్తాయి. ఆగస్టు 15 వరకు బ్రేక్ పడుతుంది. మళ్లీ శ్రావణ మాసం వస్తేనే గానీ పెళ్లిళ్లు జరగవు. ఈ కొద్ది రోజుల్లోనే పెళ్లిళ్లు చేయాలని అందరూ చూస్తున్నారు. మార్కెట్లో విపరీతమైన పోటీ ఏర్పడింది. పురోహితులు, ఫంక్షన్ హాళ్ల యజమానులు, డెకరేటర్లు రేట్లు పెంచేస్తున్నారు.

అంతర్జాతీయ యుద్దాల ప్రభావం
పెళ్లిళ్ల హడావుడి వెనుక తల్లిదండ్రులకు పెద్ద బడ్జెట్ సవాల్ ఎదురవుతోంది. అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. యుద్ధ వాతావరణం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రవాణా ఖర్చులు, వాహనాల కిరాయిలు భారీగా పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. క్యాటరింగ్ నిర్వాహకులు దీనిని సాకుగా చూపిస్తున్నారు. పెళ్లి విందులో ప్లేటు ధరలను విపరీతంగా పెంచేశారు. సమాజంలో హోదా కోసం కనీసం పాతిక రకాల వంటకాలు వడ్డిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి భోజనం ప్లేటు ధర కనీసం ఐదు వందల రూపాయలు దాటుతోంది.

సామాన్యుడికి బంగారం భారం
మధ్యతరగతి, పేద కుటుంబాలకు పెళ్లిలో బంగారం కొనుగోలు పెద్ద భారంగా మారింది. సంప్రదాయం ప్రకారం మంగళసూత్రాలు, గొలుసు, కమ్మలు, గాజులు కొనాలి. ఈ కనీస అవసరాల కోసమే ఐదు నుంచి ఆరు తులాల బంగారం కావాలి. ఏడాది క్రితంతో పోలిస్తే పసిడి ధరలు విపరీతంగా పెరిగాయి. కేవలం బంగారం కొనుగోలుకే ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు అవుతోంది. బంగారం కాకుండా మండపం అద్దె, డెకరేషన్, విందు భోజనాలు, ప్రయాణాలకు అదనంగా మరో ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఖర్చవుతోంది.

తల్లిదండ్రుల ఆవేదన
అంతర్జాతీయ పరిస్థితుల ముందటి కాలంతో పోలిస్తే ఇప్పుడు ఖర్చులు మారాయి. ప్రస్తుతం ఒక్కో పెళ్లికి సగటున ఐదు లక్షల రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. సమయం తక్కువగా ఉండటం వల్ల అందరూ ఒకేసారి సేవలను బుక్ చేసుకుంటున్నారు. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవైపు కుటుంబంలో పెళ్లి జరుగుతుందనే సంతోషం ఉంది. మరోవైపు విపరీతంగా పెరుగుతున్న ఖర్చుల భయం వెంటాడుతోంది. పెళ్లి బాజాలు మోగుతున్నా.. ఖర్చుల మోత చూసి వధూవరుల తల్లిదండ్రులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. వారు అప్పులపాలు కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.