Home Telangana ఆరోగ్యశ్రీ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన హరీశ్ రావు

ఆరోగ్యశ్రీ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన హరీశ్ రావు

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోగ్యశ్రీ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకపోవడంతో వైద్య సేవలపై ప్రభావం పడుతోందన్నారు. ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 18 నెలలుగా జీతాలు అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నెలల తరబడి వేతనాలు లేకుండా సిబ్బంది, వారి కుటుంబాలు ఎలా జీవించాలని ప్రశ్నించారు. ప్రతి నెలా ఒకటో తేదీకే జీతాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు.

సిద్దిపేటలో రూ.24 కోట్ల బకాయిలు

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు 2023 నవంబర్‌ నుంచి ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కాలేదని హరీశ్ రావు ఆరోపించారు. దాదాపు రూ.24 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. నిధుల కొరతతో ఆసుపత్రుల నిర్వహణ, మందులు, వైద్య పరికరాలు, రోగుల సంరక్షణపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించిన ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న రూ.1,400 కోట్ల బకాయిలను, 18 నెలలుగా నిలిచిపోయిన సిబ్బంది జీతాలను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

 

#Aarogyasri #AarogyasriDues #HarishRao #RevanthReddy #TelanganaAarogyasri #TelanganaPolitics #Siddipet #AarogyasriPayments #HospitalDues #HealthScheme #BRS #TelanganaNews #AarogyasriStaff #PendingBills #Healthcare