Home AP నేడు కేరళకు పవన్ కళ్యాణ్ భుజం చికిత్స కోసం థెరపీ

నేడు కేరళకు పవన్ కళ్యాణ్ భుజం చికిత్స కోసం థెరపీ



జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ శనివారం కేరళకు వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి రొటేటర్‌ కఫ్‌ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనకు తదుపరి చికిత్సలో భాగంగా కేరళలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. శస్త్రచికిత్స తర్వాత వైద్యులు పూర్తిస్థాయి విశ్రాంతి సూచించినా, పాలనా బాధ్యతల నేపథ్యంలో పవన్‌ వారం రోజుల్లోనే క్యాంపు కార్యాలయానికి అందుబాటులోకి వచ్చారు. అనంతరం ముందుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు శాఖాపరమైన సమీక్షలు, పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించారు. దీంతో శస్త్రచికిత్స చేసిన కుడి భుజంపై మళ్లీ ఒత్తిడి పెరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో భుజం ప్రాంతంలో వాపు పెరగడంతో పాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చినట్లు వెల్లడించాయి.

చికిత్సతో పాటు పాలన

ప్రస్తుతం భుజం పూర్తిగా కోలుకునేలా వైద్యుల సూచనలను పాటించాలని పవన్‌ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు జనసేన కేంద్ర కార్యాలయం తెలిపింది. కేరళలోని ఆయుర్వేద వైద్యాలయంలో ప్రత్యేక థెరపీ తీసుకోవడం ద్వారా శస్త్రచికిత్స అనంతర సమస్యలను తగ్గించుకోవడంపై ఆయన దృష్టి పెట్టనున్నారు. వైద్యుల సూచన మేరకు చికిత్స, విశ్రాంతికి ప్రాధాన్యం ఇస్తూనే పాలనా బాధ్యతలను కొనసాగించాలని పవన్‌ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు కొంతకాలం బహిరంగ కార్యక్రమాలు, అధికారిక విధులకు దూరంగా ఉండాలని సూచించినప్పటికీ, ప్రభుత్వ బాధ్యతల కారణంగా ఆయన వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నారు. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాతే సాధారణ కార్యక్రమాల్లో పాల్గొనేలా వైద్యుల సలహా మేరకు తదుపరి చర్యలు ఉంటాయని జనసేన వర్గాలు వెల్లడించాయి.

 

#PawanKalyan #PawanKalyanKeralaVisit #PawanKalyanHealth #ShoulderTreatment #RotatorCuffInjury #AyurvedicTherapy #KeralaTreatment #AndhraPradeshDeputyCM #JanaSena #PawanKalyanSurgery #KeralaAyurveda #AndhraPradeshPolitics