ఖర్గే ఆవేదన సీరియస్‌గా తీసుకున్న రాగా .
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సామాజిక న్యాయం, పార్టీ అధికారిక వైఖరిపై నేతలు బలంగా మాట్లాడటం లేదన్న అసంతృప్తి సమావేశంలో వ్యక్తమైంది. ఉత్తరాఖండ్ హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించిన ప్రదేశంలో జరిగిన “శుద్ధీకరణ కార్యక్రమం”పై పార్టీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై ఖర్గే ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ ఘటనను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించిందని వివరించినా, ఖర్గే పూర్తిగా సంతృప్తి చెందలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. పార్టీ సోషల్ మీడియా విభాగం నేత సుప్రియా శ్రీనతే రోజువారీ నివేదికలు సిద్ధం చేసి, ఎవరు పార్టీ అధికారిక వైఖరిని ప్రచారం చేస్తున్నారు, ఎవరు మౌనంగా ఉంటున్నారో నమోదు చేయాలని రాహుల్ కోరినట్లు సమాచారం.
టీవీ ముఖాలపై ఖర్గే గుర్రు
సమావేశంలో ఖర్గే కొందరు నేతల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. టీవీ చర్చల్లో చురుగ్గా కనిపించే కొందరు నేతలు కీలక అంశాల్లో పార్టీ లైన్‌కు అనుగుణంగా మాట్లాడటం లేదన్నది ఆయన ప్రధాన అభ్యంతరంగా కనిపించింది. ముఖ్యంగా సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాల్లో పార్టీ నేతలు సమష్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని చర్చ జరిగింది. మరోవైపు విద్యార్థుల ఉద్యమాల అంశంలో రాహుల్ గాంధీ, సీనియర్ నేత మనీష్ తివారీ మధ్య అభిప్రాయ భేదం బయటపడింది. దేశంలో గతంలో జరిగిన కొన్ని విద్యార్థి ఉద్యమాలను తివారీ ప్రస్తావించారు. తమిళనాడులో 1960ల యాంటీ హిందీ ఉద్యమాలు, ఉత్తర భారతంలో ఇంగ్లిష్ వ్యతిరేక విద్యార్థి నిరసనలు, 1970ల గుజరాత్ నవనిర్మాణ ఉద్యమం, 1980ల మండల్ ఉద్యమాలను ఆయన ఉదాహరణలుగా పేర్కొన్నారు. రాజకీయ పార్టీల విద్యార్థి విభాగాలు ఈ ఉద్యమాలను నడిపించడంలో పెద్దగా విజయవంతం కాలేదని తివారీ అభిప్రాయపడ్డారు.
రాహుల్-తివారీ మధ్య మళ్లీ విభేదాలు
తివారీ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ భిన్నంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 1970ల చివర, 1980ల ప్రారంభంలో విద్యార్థులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని రాహుల్ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో విద్యార్థి ఉద్యమాల స్వభావం, వాటిపై కాంగ్రెస్ రాజకీయ పాత్ర విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం స్పష్టమైంది. పార్టీ వర్గాల ప్రకారం, రాహుల్ గాంధీ, మనీష్ తివారీ మధ్య మూసివేసిన సమావేశంలో విభేదాలు వ్యక్తమవడం ఇది మూడోసారి. సమావేశం అనంతరం తివారీ మీడియాతో మాట్లాడలేదు. అయితే సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఓ పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మాజీ బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ, నాయకుడు బయటకు బలంగా కనిపించినా పార్టీ వ్యవస్థలో అంతర్గతంగా బలహీనంగా ఉండవచ్చన్న భావనను తివారీ వ్యక్తం చేశారు.
#Congress #RahulGandhi #MallikarjunKharge #CongressWorkingCommittee #CongressCWC #CongressLeadership #CongressCrisis #CongressDiscipline #ManishTewari #KCVenugopal #SupriyaShrinate #IndianPolitics #CongressNews #PoliticalNews #RahulGandhiNews











