త్రిదేశీయ ఏ సిరీస్‌లో భారత్ ఏ జట్టు అఫ్గానిస్థాన్ ఏపై 101 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. డంబుల్లాలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ తిలక్ వర్మ (59), ప్రియాంశ్ ఆర్య (58), కుమార్ కుశాగ్ర (58) అర్ధసెంచరీలతో జట్టుకు బలమైన పునాది వేశారు. అనంతరం 320 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ ఏ జట్టును భారత బౌలర్లు 36.5 ఓవర్లలో 218 పరుగులకే కట్టడి చేశారు. నిశాంత్ సింధు నాలుగు వికెట్లతో చెలరేగగా, యశ్ ఠాకూర్ రెండు వికెట్లు తీశాడు. అన్షుల్ కాంబోజ్, అనుకుల్ రాయ్, విప్రాజ్ నిగమ్, సూర్యాంశ్ షెడ్గే తలో వికెట్ సాధించారు. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా అద్భుతమైన క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రియాంశ్ ఆర్య, ప్రత్యామ్నాయ ఫీల్డర్ అశోక్ శర్మ కూడా అద్భుత క్యాచ్‌లతో మెరిశారు. ఈ విజయంతో నెట్ రన్‌రేట్‌లో శ్రీలంక ఏ జట్టును అధిగమించిన భారత్ ఏ ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.











