కేంద్రానికి పొన్నం ప్రభాకర్ డిమాండ్.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనలో బీసీల వివరాలకు స్పష్టమైన స్థానం లేకపోవడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కులగణనలో బీసీ జనాభాను శాస్త్రీయంగా లెక్కిస్తేనే వారికి దామాషా ప్రకారం సామాజిక న్యాయం అందుతుందని స్పష్టం చేశారు. 40 ప్రశ్నల్లో ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాల ప్రస్తావన ఉన్నా ఓబీసీల వివరాలను స్పష్టంగా పొందుపరచలేదని విమర్శించారు. 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించాలంటే ప్రామాణిక కులగణన లెక్కలను సుప్రీంకోర్టు ముందు ఉంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం శాస్త్రీయంగా బీసీ కులగణన నిర్వహించి వివరాలను కోర్టు ముందు ఉంచిందని గుర్తుచేశారు. బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఏప్రిల్ 1, 2025న కేంద్రం ప్రకటించిన విధంగానే కులగణనలో బీసీలను చేర్చాలని డిమాండ్ చేశారు.
మోదీకి లేఖ.. ప్రత్యేక కేటగిరీకి డిమాండ్
2027 జనాభా లెక్కల్లో ఓబీసీ/ఎస్‌ఈబీసీలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ, ఎస్లఈబీసీలకు ప్రత్యేక కేటగిరీ, రాష్ట్రాల వారీగా మాస్టర్ కుల డైరెక్టరీ, ప్రతి కులానికి ప్రత్యేక డిజిటల్ కోడ్ ఏర్పాటు చేయాలని కోరారు. 2011 సామాజిక, ఆర్థిక, కుల గణనలో ఎదురైన కులాల పేర్లు, స్పెల్లింగ్‌లు, ఉపకులాల సమస్యలు మళ్లీ తలెత్తకుండా ప్రమాణీకృత విధానం అమలు చేయాలని సూచించారు. తెలంగాణలో నిర్వహించిన సీపెక్ సర్వే అనుభవాన్ని 2027 జనాభా లెక్కల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బీసీల వాస్తవ జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఖచ్చితమైన సమాచారం ఉంటేనే రిజర్వేషన్లు, విద్య, ఉపాధి, సంక్షేమం, సమాన ప్రాతినిధ్యంపై సమర్థవంతమైన విధానాలు రూపొందించగలమని మంత్రి స్పష్టం చేశారు.
#PonnamPrabhakar #OBC #OBCCensus #CasteCensus #CasteSurvey #Telangana #TelanganaPolitics #2027Census #SEBC #BCWelfare #SocialJustice #OBCReservation #NarendraModi #Congress #TelanganaCongress











