హసీనా అప్పగింత.. మరో కీలక డిమాండ్.
రెండు షరతులతో ఢిల్లీ వస్తానన్న ప్రధాని.
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహమాన్ ప్రతిపాదిత భారత్ పర్యటనకు ఢాకా రెండు కీలక షరతులు విధించింది. న్యూఢిల్లీ పర్యటనకు అనుకూల వాతావరణం ఏర్పడాలంటే భారత్ తమకు కావాల్సిన వ్యక్తులను అప్పగించాలని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇరు దేశాల అధికారులు కొన్ని వారాలుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తెలిపింది. అయితే మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించడం ప్రధాన డిమాండ్‌గా నిలిచింది. హసీనాతో పాటు బంగ్లాదేశ్‌లో కేసులు ఎదుర్కొంటున్న ఇతర పరారీలను కూడా అప్పగించాలని ఢాకా కోరుతోంది.
హసీనా వ్యాఖ్యలతో మరింత వివాదం
ఆగస్టు 5న న్యూఢిల్లీలో షేక్ హసీనా నిర్వహించిన బహిరంగ కార్యక్రమం పర్యటన చర్చలపై ప్రభావం చూపిందని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఏకేఎం షాహిదుల్ కరీమ్ తెలిపారు. హసీనాను త్వరగా అప్పగించాలని భారత్‌ను కోరుతున్నామని ఆయన చెప్పారు. అలాగే రాజకీయ కార్యకర్త షహీద్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులైన వ్యక్తులను కూడా ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్‌కు అప్పగించాలని ఢాకా కోరింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను మార్చిలో పశ్చిమ బెంగాల్ పోలీసులు బోంగావ్ సరిహద్దు ప్రాంతంలో అరెస్టు చేశారు.
భారత్ నిర్ణయంపైనే ఉత్కంఠ
తారిఖ్ రహమాన్ భారత్ పర్యటనపై తుది నిర్ణయం ఇప్పుడు న్యూఢిల్లీ స్పందనపై ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది. భారత్‌తో సార్వభౌమ సమానత్వం, జాతీయ గౌరవం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని బంగ్లాదేశ్ ప్రకటించింది. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం ఆమె భారత్‌కు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ హసీనాకు మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో శిక్ష విధించింది. హసీనా అప్పగింతపై బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థన పరిశీలనలోనే ఉందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పుడు రహమాన్ పర్యటనను అదే అంశంతో ముడిపెట్టడంతో ఢిల్లీ–ఢాకా సంబంధాలపై మరోసారి ఉత్కంఠ నెలకొంది.
#TariqueRahman #SheikhHasina #Bangladesh #IndiaBangladeshRelations #BangladeshPolitics #IndiaPolitics #IndiaVisit #Extradition #SheikhHasinaExtradition #DhakaDelhi #DiplomaticRelations #SouthAsia











