ఎంతటి వారికైనా అదే చివరి రోజు.
అక్రమార్కులపై విజయ్ సమర శంఖం.
ప్రజలే పాలకులు.. అధికారులే సేవకులు.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో అవినీతిపై కఠిన వైఖరి ప్రకటించారు. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తమిళనాడును అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని చెప్పారు. అవినీతిపై ప్రజల్లో జీరో టాలరెన్స్ రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చిన ప్రజలు ఓటు వేసి బాధ్యత ముగిసిందని భావించకూడదని విజయ్ అన్నారు. ప్రజలే పాలకులని, ప్రభుత్వం ప్రజలకు సేవకురాలిగా పనిచేయాలని స్పష్టం చేశారు. కులం, మతం, డబ్బు, కండబలం ప్రభావాన్ని పక్కనపెట్టి తనకు మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ సేవల్లో గౌరవమే తొలి నియమం
ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు ప్రజలకు సేవా కేంద్రాలుగా పనిచేయాలని సీఎం విజయ్ ఆదేశించారు. ప్రభుత్వ అధికారులను కలిసేందుకు వచ్చే ప్రజలను గౌరవంగా, మర్యాదగా చూడాలని, సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిప్పకూడదని స్పష్టం చేశారు. జూన్ 29, 30 తేదీల్లో జరిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సమావేశంలో ఈ మేరకు కఠిన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో ప్రజా సంక్షేమం కోసం పరిపాలనా సహకారం కొనసాగుతుందని చెప్పారు. అయితే తమిళనాడు హక్కులకు వ్యతిరేకంగా ఉండే కేంద్ర విధానాలను మాత్రం టీవీకే ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ప్రజా సంక్షేమ పథకాల్లో ఉపయోగకరమైన వాటిని కొనసాగిస్తామని తెలిపారు. జయలలిత తీసుకొచ్చిన అమ్మ క్యాంటీన్లను మరింత సమర్థంగా నిర్వహిస్తామని, ఉదయం అల్పాహార పథకాన్ని 6 నుంచి 8వ తరగతి వరకు విస్తరిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17 నుంచి ఈ విస్తరణ అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులకు ఊరట
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం విజయ్ పలు కీలక ఆర్థిక ప్రకటనలు చేశారు. మాజీ సైనికుల ఇద్దరు కుమార్తెల వివాహానికి ఇచ్చే సాయాన్ని ఒక్కొక్కరికి రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. దివ్యాంగ మాజీ సైనికులు, వారి కుటుంబాలకు నెలవారీ సాయాన్ని రూ.5 వేల నుంచి రూ.7 వేలకు పెంచారు. స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్‌ను రూ.23 వేలకు, కుటుంబ పింఛన్‌ను నెలకు రూ.12,500కు పెంచినట్లు తెలిపారు. వీరపాండ్య కట్టబొమ్మన్, ముత్తురామలింగ విజయరఘునాథ సేతుపతి, మరుదు సోదరులు, వి.ఓ. చిదంబరనార్ వారసులకు నెలవారీ సాయాన్ని రూ.11,500కు పెంచారు. అవినీతిపై పోరాటాన్ని మరో స్వాతంత్ర్య ఉద్యమంగా అభివర్ణించిన విజయ్.. కులం, మతం, భాషా భేదాలు తొలగి ప్రజలంతా ఒక్కటైనప్పుడే నిజమైన స్వేచ్ఛ సాధ్యమని చెప్పారు. తన ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని, తమిళనాడును కొత్త దిశలో తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
#Vijay #TamilNaduCM #TamilNaduPolitics #TVK #CorruptionFreeTamilNadu #AntiCorruption #VijaySpeech #IndependenceDay2026 #TamilNaduGovernment #TamilNaduNews #PublicService #GovernanceReforms #FreedomFighters #ExServicemen











