Home National_news స్కూల్ ఠీక్ కరో బొద్దింకల కొత్త డిమాండ్‌

స్కూల్ ఠీక్ కరో బొద్దింకల కొత్త డిమాండ్‌


సర్కారీ విద్యపై కాక్రోచ్‌ పార్టీ పోరాటం.
కనీస సదుపాయాలపై దేశవ్యాప్త ఉద్యమం.

కాక్రోచ్‌ జనతా పార్టీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే ‘స్కూల్‌ థిక్‌ కరో’ ప్రచారాన్ని ప్రారంభించారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం సంతుక్‌ పింప్రిలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన తర్వాత జిల్లా పరిషత్‌ పాఠశాలను ఆయన పరిశీలించారు. పాఠశాలలో మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదని, కిటికీలు దెబ్బతిన్నాయని, విద్యార్థులకు సరిపడా బెంచీలు లేవని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తయినా ప్రభుత్వ పాఠశాలలో కనీసం నీరు కూడా లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని దీప్కే ప్రశ్నించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా సమాచారాన్ని సేకరించేందుకు చెక్‌లిస్ట్‌ రూపొందించామని తెలిపారు. మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా పాఠశాలల పరిస్థితిపై డేటా సేకరించి పూర్తి వివరాలను సిద్ధం చేస్తామని చెప్పారు.

ప్రభుత్వ స్కూళ్ల మూసివేతపై ఆరోపణలు

ప్రభుత్వ పాఠశాలలకు సరైన సదుపాయాలు కల్పించకుండా వాటిని మూసివేస్తున్నారని దీప్కే ఆరోపించారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 94 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆయన పేర్కొన్నారు. విద్యా రంగానికి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందితే ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని, అందుకే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని అన్నారు. పేద విద్యార్థులకు కూడా సమాన విద్యా అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు భారీగా ఉన్నాయని, ఒక్కో విద్యార్థి కుటుంబం ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల ఫీజులకు పరిమితి విధించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆసుపత్రులపైనా తదుపరి పోరాటం

విద్య తర్వాత ప్రజారోగ్య సమస్యలపై కూడా ఉద్యమం చేపడతామని సీజేపీ ప్రకటించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు నేలపైనే పడుకోవాల్సిన పరిస్థితి, శస్త్రచికిత్సల కోసం వేచి ఉండటం, సీటీ స్కాన్‌ కోసం వారం రోజుల వరకు నిరీక్షించాల్సి రావడం వంటి సమస్యలు ఉన్నాయని దీప్కే ఆరోపించారు. తదుపరి దశలో మహారాష్ట్రలోని వివిధ తాలూకాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మౌలిక సదుపాయాలపై వివరాలు సేకరిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంత యువత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిధులు ఎలా ఖర్చవుతున్నాయో యువత ప్రశ్నించాలి అని అన్నారు. పట్టణాలకే రాజకీయ చర్చ పరిమితం కాకూడదని, గ్రామీణ యువత కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. మొత్తంగా ‘స్కూల్‌ థిక్‌ కరో’ ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థలోని లోపాలను వెలుగులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని దీప్కే స్పష్టం చేశారు.

 

#SchoolTheekKaro #CockroachJanataParty #AbhijeetDipke #GovernmentSchools #PublicEducation #SchoolInfrastructure #EducationReform #SchoolFacilities #MaharashtraSchools #StudentWelfare #EducationIndia #GovernmentSchoolCampaign #IndiaNews