Home Naadesam_Special రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0 పెట్టుబడులు, ఇళ్లు, రైతులకు వరాలు

రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0 పెట్టుబడులు, ఇళ్లు, రైతులకు వరాలు


కేబినెట్‌ కీలక నిర్ణయాలు.

తెలంగాణలో భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0 నిర్వహించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈసారి ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ థీమ్‌తో సదస్సు జరగనుంది. ఫ్యూచర్‌ సిటీ ప్రణాళికను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, ఫార్మా తదితర రంగాల్లో పెట్టుబడి అవకాశాలను చాటిచెప్పనున్నారు. తెలంగాణ స్టార్టప్‌లు, పరిశ్రమల విజయాలు, కొత్త ఆవిష్కరణల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు, స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్‌కమిటీతో పాటు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్యూఆర్‌ఈ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భూముల కేటాయింపును వేగవంతం చేయాలని ఆదేశించారు. అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చేలా చర్యలు చేపట్టనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ఘనంగా నిర్వహించేందుకు కేబినెట్‌ నిర్ణయించింది.

రైతులు, యువతకు కీలక నిర్ణయాలు

వానాకాలం పంటలో ఏడు రకాల సన్న ధాన్యాల సాగును ప్రోత్సహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికల ద్వారా రైతులకు విస్తృత అవగాహన కల్పించనున్నారు. ఈ ఏడాది నుంచి ఆ ఏడు రకాల సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లించనున్నారు. ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదిలాబాద్‌, నిర్మల్‌, ముథోల్‌, బోథ్‌, సిర్పూర్‌, గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో కొత్త యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు అనుమతి ఇచ్చింది. తొలి విడతలో 113 నియోజకవర్గాల్లో స్కూల్‌ కాంప్లెక్స్‌లు నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 86 స్కూళ్లకు అనుమతులు లభించాయి. మిగిలిన ప్రాంతాల్లో స్థల సేకరణ పూర్తి చేసి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో విద్య, నైపుణ్యాభివృద్ధికి కొత్త దిశ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆటోలకు ఈవీ.. సాగునీటికి భారీ నిధులు

హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో కాలుష్య నియంత్రణకు రూ.200 కోట్లతో పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను ఈవీలుగా మార్చే ప్రత్యేక పథకానికి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 18,766 ఆటోల్లో అర్హులైన డ్రైవర్లకు ఒక్కో వాహనంపై గరిష్ఠంగా రూ.1.50 లక్షల సబ్సిడీ ఇవ్వనున్నారు. నగరంలోని కాలుష్య పరిశ్రమలను శివారు ప్రాంతాలకు తరలించే హిల్ట్‌ పాలసీ దరఖాస్తుల గడువును అక్టోబర్‌ 31 వరకు మరో మూడు నెలలు పొడిగించారు. మరోవైపు మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల ఫేజ్‌-2కు రూ.2,100 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు, ప్రాంతానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందనుంది. గూడెం దొడ్డి పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై అధ్యయనం కోసం కన్సల్టెంట్‌ను నియమించనున్నారు. పెట్టుబడులు, ఇళ్లు, రైతులు, విద్య, పర్యావరణం, సాగునీరు కేంద్రంగా కేబినెట్‌ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చాయి.

 

#TelanganaRisingGlobalSummit #TelanganaCabinet #InvestTelangana #FutureCity #TelanganaInvestments #IndirammaHouses #SmartRationCards #TelanganaFarmers #FarmersBonus #YoungIndiaSkillsUniversity #SkillDevelopment #EVAutos #HyderabadPollution #IrrigationProjects #TelanganaDevelopment #TelanganaGovernment #BhattiVikramarka #RevanthReddy #TelanganaNews #TelanganaPolitics