Home Sports_News ఐపీఎల్‌ వల్లే ఇన్ని గాయాలా? ఆటగాళ్లపై ఒత్తిడి.. బీసీసీఐలో కలకలం

ఐపీఎల్‌ వల్లే ఇన్ని గాయాలా? ఆటగాళ్లపై ఒత్తిడి.. బీసీసీఐలో కలకలం



భారత క్రికెట్‌లో వరుస గాయాలపై బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల ఒత్తిడి, ఆర్థిక ప్రయోజనాల కారణంగా కొందరు ఆటగాళ్లు గాయాలతోనే మ్యాచ్‌లు ఆడుతున్నారని ఓ సీఓఈ అధికారి వ్యాఖ్యానించినట్లు ఏఎన్‌ఐ వెల్లడించింది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత గాయాలతో సీఓఈకి చేరుతున్న ఆటగాళ్ల పునరావాసం మరింత క్లిష్టంగా మారుతోందని తెలిపారు. అధిక క్రికెట్‌ వల్ల శరీరంపై భారం పెరుగుతోందని, ముఖ్యంగా సీనియర్‌ ఆటగాళ్లలో ఓవర్‌యూజ్‌, స్ట్రెస్‌ గాయాలు ఎప్పుడు కోలుకుంటాయో చెప్పడం కష్టంగా మారుతోందని పేర్కొన్నారు. జట్టు ఫిజియోలు, సీఓఈ వైద్య సిబ్బంది ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నా, గాయాల తీవ్రత ఎంపికలు, జట్టు ప్రణాళికలపై ప్రభావం చూపుతోందని వివరించారు.

శ్రీలంక సిరీస్‌కు గాయాల సెగ

ప్రస్తుతం శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాలు వేధిస్తున్నాయి. సాయి సుదర్శన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, హర్షిత్‌ రాణా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌ అందుబాటులో లేరు. ఆకాష్‌ దీప్‌ కూడా గాయం కారణంగా దూరంగా ఉన్నారు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఫిట్‌నెస్‌పై కూడా స్వల్ప ఆందోళన నెలకొంది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా టెస్టు సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో గాయాల నిర్వహణపై బీసీసీఐ దృష్టి పెట్టింది. ఐపీఎల్‌లో ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను ఎలా నియంత్రించాలి, ఫ్రాంచైజీలు, జాతీయ జట్టు వైద్య బృందాల మధ్య సమన్వయం ఎలా పెంచాలన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

 

#IPL #IPL2026 #BCCI #CricketInjuries #PlayerWorkload #IndianCricket #BCCI_CoE #CentreOfExcellence #IPLWorkload #JaspritBumrah #SaiSudharsan #ShubmanGill #WashingtonSundar #AkashDeep #IndiaCricket #SriLankaSeries #CricketNews