కాళేశ్వరం ప్రాజెక్టులోని మోటర్లను తక్షణమే ఆన్ చేసి రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు. రిజర్వాయర్లను సకాలంలో నింపకపోవడంతో వానాకాలం పంట సాగుపై రైతుల్లో ఆందోళన పెరుగుతోందని తెలిపారు. కాళేశ్వరం పరిధిలోని అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపాలని కోరారు. తద్వారా సుమారు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని చెప్పారు. మిడ్‌మానేరు నుంచి మోటర్ల ద్వారా నీటిని పంపింగ్ చేసి ఆయకట్టుకు నీరందించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండటం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
లోయర్ మానేరు నింపాలని విజ్ఞప్తి
లోయర్ మానేరు డ్యామ్ పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 6.9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని హరీశ్‌రావు తెలిపారు. మిడ్‌మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటిని తరలించి రిజర్వాయర్‌ను నింపాలని కోరారు. గత యాసంగిలో కాళేశ్వరం పరిధిలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని గుర్తుచేశారు. ఈ వానాకాలంతో పాటు వచ్చే యాసంగి పంటకు కూడా నీటి కొరత లేకుండా ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అన్ని రిజర్వాయర్లను దశలవారీగా నింపి రైతులకు సాగునీటి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా మోటర్లను నడిపి నీటి పంపింగ్ ప్రారంభించాలని కోరారు. రైతుల పంటలు ఎండిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
#Kaleshwaram #KaleshwaramProject #KaleshwaramMotors #HarishRao #Telangana #TelanganaFarmers #Irrigation #IrrigationWater #MidManair #LowerManair #MallannaSagar #RanganayakaSagar #KondapochammaSagar #TelanganaAgriculture #TelanganaNews











