వర్షాలు సమృద్ధిగా కురవాలని సీఎం ప్రార్థన
రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లో కృష్ణా నది ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం శాస్త్రోక్తంగా ముగిసింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో యాగాన్ని నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు గోపూజతో ప్రారంభమైన కార్యక్రమంలో పుణ్యాహవచనం, అంకురారోపణ, వృషభ పూజతో పాటు పలు వైదిక క్రతువులు నిర్వహించారు. వేదమంత్రాల మధ్య కొనసాగిన యాగం మధ్యాహ్నం 3.24 గంటలకు పూర్ణాహుతితో పూర్తయింది. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద జరిగిన పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి దంపతులు హాజరై రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులు నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు.
కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలు కళకళలాడాలి
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రార్థించారు. కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని, శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్ని ప్రాజెక్టులు జలకళతో నిండాలని ఆకాంక్షించారు. ప్రతి చెరువు, కుంటలో నీరు చేరి భూగర్భ జలాలు పెరగాలని, పంటలు పుష్కలంగా పండాలని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యాగం నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతూనే భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ వరుణయాగం నిర్వహించినట్లు పేర్కొంది. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, పి. సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
#NagarjunaSagar #VarunaYagam #RevanthReddy #Telangana #TelanganaCM #KrishnaRiver #GoodRains #TelanganaFarmers #Rainfall #VarunaYagam2026 #TelanganaNews #NagarjunaSagarNews #KrishnaGodavari #IndianTraditions #IndiaNews











