భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్ దినేష్ త్రివేది సోమవారం ప్రధాని తారిక్ రహ్మాన్‌తో భేటీ అయ్యారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో నిర్వహించిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌పై ఢాకా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
హసీనా వ్యాఖ్యలతో దౌత్య వేడి
ఆగస్టు 5న ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో హసీనా తారిక్ రహ్మాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత గడ్డపై నుంచి హసీనా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపవచ్చని బంగ్లాదేశ్ ముందుగానే భారత్‌కు ఆందోళన వ్యక్తం చేసింది. అయినా కార్యక్రమం జరగడంతో ఢాకా అసంతృప్తి వ్యక్తం చేసింది. హసీనా చేసిన వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమమని తెలిపింది. బంగ్లాదేశ్‌లోని ఎన్నికైన ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను భారత్ సమర్థించదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీంతో ఢాకాకు భారత్ తన దౌత్య వైఖరిని స్పష్టంగా తెలియజేసినట్లయింది.
తారిక్ సర్కారుతో ఆచితూచి
తారిక్ రహ్మాన్‌తో దినేష్ త్రివేది భేటీని భారత దౌత్య వర్గాలు సానుకూల పరిణామంగా చూస్తున్నాయి. సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని సమాచారం. బంగ్లాదేశ్ తరఫున విదేశాంగ మంత్రి ఖలీలుర్ రహ్మాన్, ప్రధాని విదేశాంగ వ్యవహారాల సలహాదారు హుమాయున్ కబీర్ పాల్గొన్నారు. భారత హైకమిషనర్‌తో పాటు డిప్యూటీ హైకమిషనర్ పవన్ బాదే హాజరయ్యారు. 2024లో హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత భారత్ బంగ్లాదేశ్‌తో సంబంధాలను జాగ్రత్తగా కొనసాగిస్తోంది. 2026 ఫిబ్రవరి ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత తారిక్ రహ్మాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రభుత్వంతో సంబంధాలు మెరుగుపరచేందుకు భారత్ పలు దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. ద్వైపాక్షిక సమావేశానికి ఆహ్వానం, సెప్టెంబర్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం కూడా అందించింది.
గంగానది ఒప్పందమే అసలు పరీక్ష
ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో భారతదేశానికి చెందిన ఉన్నతస్థాయి భద్రతా ప్రతినిధి బృందం పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో హైకమిషనర్–తారిక్ భేటీ జరగడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. హసీనా అంశం రెండు దేశాల మధ్య ప్రధాన సున్నిత అంశంగా మారినప్పటికీ.. భద్రత, సరిహద్దులు, వాణిజ్యం, నీటి ఒప్పందాలపై సంబంధాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్–బంగ్లాదేశ్ మధ్య పరిష్కరించాల్సిన కీలక అంశాల్లో గంగా జలాల ఒప్పందం ప్రధానమైనది. 1996లో కుదిరిన గంగా జలాల ఒప్పందం 2026 డిసెంబర్‌లో ముగియనుంది. దాని పునరుద్ధరణకు విస్తృత చర్చలు అవసరం. సెప్టెంబర్‌లో తారిక్ రహ్మాన్ భారత్‌కు వచ్చి బ్రిక్స్ సదస్సులో పాల్గొనే అవకాశం ఉండటంతో.. అదే సమయంలో కీలక ద్వైపాక్షిక చర్చలకు మార్గం ఏర్పడవచ్చని భావిస్తున్నారు.
#IndiaBangladesh #IndiaBangladeshRelations #TariqueRahman #DineshTrivedi #SheikhHasina #BangladeshPolitics #IndiaDiplomacy #DiplomaticTensions #GangaWaterTreaty #BRICS #BangladeshNews #IndiaNews #SouthAsia #ForeignPolicy #Diplomacy











