Home Telangana పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ ఫ్యామిలీని ఓదార్చిన బీఆర్ఎస్ అధినేత

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ ఫ్యామిలీని ఓదార్చిన బీఆర్ఎస్ అధినేత


₹ 2.25 కోట్ల ఆర్థిక సాయం అందజేత

తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పరామర్శించారు. నల్లబెల్లిలోని పెద్ది స్వగృహానికి చేరుకున్న కేసీఆర్ ముందుగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. పెద్ది కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేసీఆర్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఈ కష్ట సమయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

చెరో కోటి, తల్లికి పాతిక లక్షలు

గతంలో ప్రకటించిన మేరకు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున మొత్తం రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించారు. వారి భవిష్యత్తు, విద్య, కుటుంబ అవసరాలకు ఈ మొత్తం ఉపయోగపడేలా చర్యలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. పిల్లల చదువు, భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో జమ చేసే నిర్ణయాన్ని కూడా కేసీఆర్ అమలు చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సంబంధిత పత్రాలను అందజేశారు. దీంతో పెద్ది కుటుంబానికి పార్టీ తరఫున మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందింది. కుటుంబ సంక్షేమానికి భవిష్యత్తులోనూ అవసరమైన సహకారం కొనసాగుతుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.

పార్టీ శ్రేణులతో మరింత సాయం

పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ అనంతరం వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. కుటుంబానికి అందించాల్సిన ఇతర సంక్షేమ కార్యక్రమాలపై ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పిల్లల భవిష్యత్తుతో పాటు కుటుంబానికి అవసరమైన ఇతర సహాయంపై కూడా పార్టీ నాయకత్వం దృష్టి పెట్టనుంది. కేసీఆర్ నల్లబెల్లికి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు దారిపొడవునా సంఘీభావం తెలిపారు. పలుచోట్ల కేసీఆర్ తన కాన్వాయ్‌ను ఆపి కార్యకర్తలను పలకరించారు. వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కేసీఆర్ వెంట ఉన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడం ద్వారా పార్టీకి ఆయన చేసిన సేవలను కేసీఆర్ మరోసారి గుర్తు చేసుకున్నారు. కుటుంబానికి కష్టకాలంలో పార్టీ నాయకత్వం అండగా ఉంటుందన్న సందేశాన్ని స్పష్టంగా ఇచ్చారు.

 

#KCR #PeddiSudarshanReddy #PeddiFamily #BRS #TelanganaPolitics #KCRNews #FinancialAssistance #Narsampet #TelanganaNews #BRSChief #PoliticalNews #Telangana