కూటమి పాలనలో అన్ని వర్గాలకు నష్టం.
దేవరపల్లి పర్యటలో జగన్ విమర్శలు .
పొగాకు రైతులకు మాజీ సీఎం పరామర్శ.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులను పరామర్శించిన ఆయన, చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లారని ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తోందని, 27 నెలల పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని అన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కిలో పొగాకు ధర రూ.289 వరకు ఉండేదని, ప్రస్తుతం రూ.236కే పరిమితమైందని తెలిపారు. రాష్ట్రంలో 232 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా ఇప్పటివరకు కేవలం 47.3 మిలియన్ కిలోలే కొనుగోలు చేశారని, వేలం కేంద్రాల్లో 30 నుంచి 40 శాతం వరకు పొగాకును తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. దళారులతో ప్రభుత్వం రాజీ పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్ విమర్శించారు.
పొగాకు యార్డులో జగన్‌తో ముఖాముఖి అయిన రైతులు కూడా తమ సమస్యలను వివరించారు. గిట్టుబాటు ధర లేక కిలోకు సుమారు రూ.70 నష్టం వస్తోందని, ఎకరానికి రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టినా ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మార్క్‌ఫెడ్ జోక్యంతో అన్ని గ్రేడ్‌ల పొగాకుకు కొనుగోళ్లు జరిగేవని, ఇప్పుడు తక్కువ గ్రేడ్ పొగాకును ఎక్కువగా తిరస్కరిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో రూ.1 లక్ష వరకు సున్నా వడ్డీ రుణాలు లభించాయని, ప్రస్తుతం రుణాలపై వడ్డీ చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. రైతు భరోసా సాయంలో కోతలు పడ్డాయని, ఒక్క ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ తమ సమస్యలు తెలుసుకోవడానికి రాలేదని వాపోయారు. వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు అండగా నిలబడి గిట్టుబాటు ధర, సున్నా వడ్డీ రుణాలు, ధరల స్థిరీకరణ చర్యలను పునరుద్ధరిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
#YSJaganMohanReddy #YSRCP #Devarapalli #TobaccoFarmers #AndhraPradesh #FarmerCrisis #FarmerSuicides #Agriculture #ChandrababuNaidu #APPolitics #TobaccoAuction #FarmerWelfare











