Home General చేనేతకు కొత్త దిశ వైవిధ్యంతో నేతన్నకు ఆదాయం

చేనేతకు కొత్త దిశ వైవిధ్యంతో నేతన్నకు ఆదాయం


మార్కెట్‌కు తగ్గ ఉత్పత్తులపై దృష్టి

ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి తూర్పుగోదావరి జిల్లా అంగర, పులుగుర్త ప్రాథమిక చేనేత సహకార సంఘాలను సందర్శించి ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత ఉత్పత్తుల్లో వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని నేతన్నలకు సూచించారు. సంప్రదాయ చీరలతో పాటు డ్రెస్ మెటీరియల్స్, వినియోగదారుల అభిరుచులకు అనుగుణమైన కొత్త డిజైన్లు, రంగులు, నమూనాలతో ఉత్పత్తులు రూపొందించాలని సూచించారు. మార్కెట్ అవసరాలను నిరంతరం అధ్యయనం చేసి నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తే చేనేత వస్త్రాలకు మరింత గిరాకీ పెరుగుతుందని చెప్పారు. ఉత్పత్తుల అభివృద్ధి, డిజైన్ నవీకరణ, నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.

చేనేత కార్మికుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేఖా రాణి తెలిపారు. ఉత్పత్తుల వైవిధ్యీకరణ ద్వారా మార్కెట్‌ను విస్తరించి చేనేత కుటుంబాలకు మెరుగైన జీవనోపాధి కల్పించవచ్చన్నారు. డిజైన్ అభివృద్ధి, మార్కెట్ అవసరాలు, ఆధునిక ఉత్పత్తుల తయారీపై నేతన్నలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు. తయారైన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఒక్కో చేనేత ఉత్పత్తికి రూ.900 నుంచి రూ.4 వేల వరకు ధర లభిస్తోందని, నాణ్యతతో కూడిన కొత్త ఉత్పత్తులు రూపొందిస్తే ఆదాయం మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయాలని నేతన్నలకు పిలుపునిచ్చారు.

 

#AndhraPradeshHandloom #HandloomWeavers #WeaverIncome #APHandlooms #HandloomProducts #HandloomIndustry #ProductDiversification #HandloomMarketing #HandloomTextiles #AndhraPradesh #Weavers #HandloomSarees #DressMaterials #TextileIndustry #RekhaRani #APNews