Home Telangana సీఎం విదేశీ పర్యటన ప్రపంచ కంపెనీలతో భేటీలు తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యం

సీఎం విదేశీ పర్యటన ప్రపంచ కంపెనీలతో భేటీలు తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యం



తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో విదేశీ పర్యటన చేపట్టనున్నారు. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ తొలి వారానికి మధ్య అమెరికా, యూకే సహా పలు కీలక దేశాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. ఆయా దేశాల్లో ప్రముఖ కంపెనీల ప్రతినిధుల అపాయింట్‌మెంట్‌లను బట్టి తుది షెడ్యూల్ ఖరారుకానుంది. ఈ పర్యటనలో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి సంస్థలు, ప్రవాస భారతీయులతో సీఎం సమావేశాలు నిర్వహించనున్నారు.

ఐటీ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు

ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అమెరికాలో చిప్ తయారీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ సంస్థలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. లండన్‌లో గ్లోబల్ పెట్టుబడిదారులు, విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.

పర్యటన తర్వాత అసెంబ్లీ సమావేశాలు

గత విదేశీ పర్యటనల్లో కుదిరిన అవగాహన ఒప్పందాల పురోగతిని కూడా సీఎం సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో చట్టసభల్లో ప్రవేశించే కనీస వయస్సును 21 సంవత్సరాలకు తగ్గించాలని కేంద్రానికి తీర్మానం పంపేందుకు ఆగస్టు 17 లేదా 18 తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశముంది. విదేశీ పర్యటన ముగించుకుని సెప్టెంబర్ రెండో వారంలో సీఎం రాష్ట్రానికి చేరుకోనున్నారని, అనంతరం మూడో వారంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని సచివాలయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

 

#RevanthReddy #Telangana #TelanganaInvestments #ForeignTour #USATour #UKTour #GlobalInvestments #InvestInTelangana #TelanganaDevelopment #AI #ArtificialIntelligence #Semiconductors #DataCenters #GreenEnergy #Pharma #LifeSciences #Aerospace #DefenceManufacturing #ITInvestments #TelanganaNews