భూ వివాదంపై తమ్మినేని వివరణ..! న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావిస్తూ ప్రచారంలో ఉన్న భూ వివాదంపై వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారంపై అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పడం తన బాధ్యతగా భావించి మాట్లాడుతున్నానని తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాలు పనిచేశానని, తాను గానీ తన కుటుంబ సభ్యులు గానీ ఎప్పుడూ చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. వివాదంలో ఉన్న భూమిని కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదని తమ్మినేని పేర్కొన్నారు. భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు ప్రక్రియ చేపట్టామని చెప్పారు. రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైన అన్ని పత్రాలను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించామని, ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయలేదన్నారు.

మేమూ బాధితులమే..

క్రిమినల్ కేసుపై ఆశ్చర్యం
రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాతే భూమిపై యాజమాన్య వివాదం ఉందని తెలిసిందని తమ్మినేని తెలిపారు. వెంటనే చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకుని సివిల్ కోర్టును ఆశ్రయించామని చెప్పారు. ఏడాదిన్నరగా కోర్టులో విచారణ కొనసాగుతోందని, ఒకవేళ అసలు యజమాని మోసపోయి ఉంటే తాము కూడా చట్టబద్ధంగా డబ్బు చెల్లించి భూమి కొనుగోలు చేసిన బాధితులమేనని అభిప్రాయపడ్డారు. సివిల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో క్రిమినల్ కేసు నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేసిందని తమ్మినేని అన్నారు. ఈ అంశంపై తమ న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తారని చెప్పారు. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని, చట్టం ముందు హాజరై అవసరమైన ప్రతి పత్రాన్ని సమర్పిస్తామని స్పష్టం చేశారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుందనే పూర్తి నమ్మకం తనకు ఉందన్నారు.

మీడియాకు విజ్ఞప్తి
కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున దర్యాప్తు పూర్తికాకముందే ఎలాంటి నిర్ణయాలకు రావద్దని తమ్మినేని మీడియాను కోరారు. అన్ని కోణాలను ప్రజల ముందుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగంపై, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, నిజం తమ వైపు ఉంటే న్యాయం తప్పకుండా జరుగుతుందని తమ్మినేని సీతారాం తెలిపారు.