Home AP శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత

3 వేల కెమెరాలు, డ్రోన్లతో తిరుమల నిఘా
లక్షలాది భక్తుల కోసం పటిష్ట ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ, తిరుపతి జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దేశవిదేశాల నుంచి భారీగా తరలివచ్చే భక్తులకు సాఫీ దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. తిరుపతిలో కీలక ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. కొండపై రద్దీ పెరిగితే భక్తులను తిరుపతిలోనే నియంత్రించి దశలవారీగా తిరుమలకు తరలిస్తారు. హోల్డింగ్ పాయింట్లలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లపై వాహనసేవల ప్రత్యక్ష ప్రసారం, ఉచిత అన్నప్రసాదం, తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి సదుపాయాలు కల్పించనున్నారు. బ్రహ్మోత్సవాల వివరాలతో రూపొందించిన 2026 బుక్లెట్‌ను చైర్మన్ బీఆర్‌ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు.

సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా

భక్తుల భద్రతకు తిరుమల, తిరుపతి పరిధిలో సుమారు 3 వేల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు. అలిపిరి టోల్‌గేట్, అలిపిరి నడకమార్గం, శ్రీవారిమెట్టు ప్రాంతాల్లో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. అలిపిరి వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసి తిరుమల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. పాత నేరస్థుల డేటాబేస్ ఆధారంగా సుమారు 1,500 మంది అనుమానితులను గుర్తించే సాంకేతిక వ్యవస్థ సిద్ధం చేశారు. టీటీడీ, పోలీసు, మున్సిపల్, రవాణా, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయంతో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ పనిచేయనుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందం, అత్యవసర పరిస్థితుల కోసం డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను సిద్ధంగా ఉంచుతున్నారు.

గరుడసేవకు భారీ బలగాలు

గరుడసేవ రోజున గతేడాదితో పోలిస్తే 15–20 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. గత ఏడాది 6.13 లక్షల మందికి అన్నప్రసాదం అందించగా, ఈసారి సుమారు 9.30 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ 10 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచనున్నారు. భద్రత కోసం 3 వేల మంది పోలీసులు, 2,500 మంది టీటీడీ భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు మరో 3,000–3,300 మంది సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టారు. రిలయన్స్ 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా ఇవ్వనుంది. లడ్డూల ఉత్పత్తి పెంపు కోసం శ్రీవారి పోటులో 400 అదనపు ఔట్‌సోర్సింగ్ పోస్టులకు ప్రభుత్వ అనుమతి కోరనున్నారు. ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీకి రూ.2.80 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. దర్శనం నుంచి రవాణా వరకు ప్రతి విభాగాన్ని ముందుగానే సిద్ధం చేస్తూ, బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు టీటీడీ సమగ్ర భద్రతా ప్రణాళికను అమలు చేయనుంది.

 

#Tirumala #Tirupati #TTD #Brahmotsavam2026 #TirumalaBrahmotsavam #SrivariBrahmotsavam #TTDSecurity #TirumalaSecurity #CCTV #DroneSurveillance #GarudaSeva #GarudaSeva2026 #TirumalaDevotees #CrowdManagement #TirupatiPolice #TTDSecurityStaff #CommandControlCentre #FacialRecognition #ANPR #TirumalaTraffic #Annaprasadam #TTDLaddu #TirupatiNews #TirumalaNews