ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని తిరువణ్ణామలై గిరివలయం మార్గంలో ఉన్న ఇడుక్కు పిళ్లయార్ ఆలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్వామి దర్శనం కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ భక్తుడు ఇరుకైన సందులో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన భక్తుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ (36) గిరిప్రదక్షిణ కోసం తిరువణ్ణామలైకి వెళ్లాడు. అనంతరం ఇడుక్కు పిళ్లయార్ ఆలయంలోని ఇరుకైన సందు గుండా వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలని ప్రయత్నించాడు. ఈ సందు గుండా వెళితే పాపాలు తొలగిపోతాయనే భక్తుల విశ్వాసం ఉంది.
అయితే శరీర బరువు కారణంగా మణికుమార్ ఆ ఇరుకైన మార్గంలోనే చిక్కుకుపోయాడు. బయటకు రాలేక తీవ్రంగా ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు, ఇతర భక్తులు వెంటనే అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మణికుమార్ మృతి చెందాడు. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తుడు ప్రాణాలు కోల్పోవడం తిరువణ్ణామలైకి వచ్చిన భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై స్థానిక అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.











