Home National_news యువతే లక్ష్యం.. రీల్సే ఆయుధం..

యువతే లక్ష్యం.. రీల్సే ఆయుధం..


యూత్‌ని టార్గెట్ చేయండి .
ఇన్‌స్టాగ్రామ్ మీద ఫోకస్ పెట్టండి .
మంత్రులకు ప్రధాని ఆదేశాలు .

దేశవ్యాప్తంగా జెన్‌జీ నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌ మంత్రులకు కొత్త దిశానిర్దేశం చేశారు. యువత ఎక్కువగా ఉండే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికను సమర్థంగా వినియోగించాలని సూచించారు. కేబినెట్ సమావేశంలో ఎంతమంది మంత్రులు ఇన్‌స్టాగ్రామ్‌ను చురుకుగా ఉపయోగిస్తున్నారని స్వయంగా ప్రశ్నించిన ప్రధాని, కోట్లాది మంది యువత ప్రతిరోజూ ఈ వేదికలో ఉంటున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే కాకుండా యువతతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని కూడా మంత్రులు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.

రీల్స్‌, ఇంటరాక్టివ్ సెషన్లకు ప్రాధాన్యం

ప్రతి మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ రూపొందించాలని, యువతతో ప్రశ్నోత్తరాలు, ఇంటరాక్టివ్ కార్యక్రమాలు నిర్వహించాలని మోదీ సూచించారు. ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సులభమైన భాషలో సమాచారాన్ని అందించాలని చెప్పారు. యువతతో డిజిటల్‌ వేదికల ద్వారా అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం ఇప్పటి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

పేపర్ లీక్‌లపై వరుస చర్యలు

కేబినెట్ సమావేశానికి కొద్ది గంటల ముందే పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న చర్యలను ప్రధాని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంబంధిత బిల్లుకు తుది రూపు ఇచ్చి పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు.

నిరసనలు కొనసాగుతున్న వేళ కీలక నిర్ణయం

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో వేలాది మంది విద్యార్థులు, యువకులు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా యువతతో నేరుగా మాట్లాడాలని ప్రధాని మంత్రులకు సూచించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సమావేశమై తమ డిమాండ్లు వినిపించారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో యువతను నేరుగా చేరుకునే వ్యూహంపై కేంద్రం మరింత దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది.

 

#PMModi #InstagramStrategy #YouthOutreach #GenZ #GenZProtests #SocialMedia #InstagramReels #CabinetMinisters #DigitalIndia #NEETPaperLeak #DharmendraPradhan #IndianPolitics