Home National_news ప్రాణాలతో వాంగ్‌చుక్ పోరాటం

ప్రాణాలతో వాంగ్‌చుక్ పోరాటం

13


హైకోర్టు జోక్యం కోరుతూ పిటిషన్!
18వ రోజు దీక్ష, 9 కిలోల బరువు తగ్గుదల
అత్యంత విషమంగా సీజేపీ నేత ఆరోగ్యం

ఒక పరీక్ష… లక్షల మంది విద్యార్థుల భవిష్యత్. ఒక అనుమానం… దేశ విద్యా వ్యవస్థపై నమ్మకానికి పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఇప్పుడు ఒక వ్యక్తి తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. రోజు రోజుకు క్షీణిస్తున్న శరీరం, తగ్గిపోతున్న బరువు, వైద్యుల హెచ్చరికలు… అయినా వెనక్కి తగ్గని సంకల్పం. ఇది కేవలం సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కాదు. ప్రభుత్వ పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థులకు న్యాయం, ప్రజాస్వామ్యంలో బాధ్యత కోరుతూ సాగుతున్న పోరాటం. ఒక వ్యక్తి ఆరోగ్యం కంటే పెద్దదిగా మారిన ఈ ఉద్యమం ఇప్పుడు దేశ మనస్సాక్షిని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం స్పందిస్తుందా? లేక ఈ పోరాటం మరింత విషాదంగా మారుతుందా అన్న ఆందోళన దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.


పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది. నీట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 28 నుంచి జంతర్‌మంతర్ వద్ద ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యులు 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నారు. పౌరసమాజ సంస్థలు, ప్రముఖులు, ప్రతిపక్ష నేతలు దీక్ష విరమించాలని కోరుతున్నా వాంగ్‌చుక్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చలేదు.

9 కిలోల బరువు తగ్గింది

కాక్‌రోచ్ జనతా పార్టీ విడుదల చేసిన ఆరోగ్య బులెటిన్ ప్రకారం వాంగ్‌చుక్ బరువు ప్రస్తుతం 57.15 కిలోలకు పడిపోయింది. దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికే 8.9 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించింది. ఒక్కరోజులోనే మరో 400 గ్రాములు తగ్గినట్లు తెలిపింది. రక్తంలో చక్కెర స్థాయి 80 మిల్లీగ్రాములు, రక్తపోటు 105/76గా నమోదైనట్లు పేర్కొంది. శరీరం తీవ్రంగా బలహీనపడినా మానసికంగా అప్రమత్తంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

24 గంటల వైద్య పర్యవేక్షణ

మొదట్లో సాధారణ వైద్య పరీక్షలతో సరిపెట్టిన వైద్య బృందం ఇప్పుడు నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది. గతంలో లడఖ్ అంశాలపై చేపట్టిన దీర్ఘకాల నిరాహార దీక్షల ప్రభావం కూడా ప్రస్తుతం ఆరోగ్యంపై కనిపిస్తున్నట్లు వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటివరకు వాంగ్‌చుక్ కేవలం ఉప్పు కలిపిన నీళ్లు మాత్రమే తీసుకుంటున్నారు. శిరామార్గంలో ద్రవాలు కూడా అందించలేదు. ఎక్కువ సమయం తాత్కాలిక మంచంపైనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఢిల్లీ హైకోర్టులో అత్యవసర పిటిషన్

వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. మరో రెండు రోజులకు మించి ఆయన ప్రాణాలతో ఉండలేరని పిటిషన్‌లో పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ద్రవ ఆహారం ద్వారా అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అందించాలని కోరారు. బలవంతపు ఆహారం ద్వారా అయినా ఆయన ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వ స్పందన కోరుతూ విచారణను మరుసటి రోజుకు వాయిదా వేసింది.

ప్రభుత్వం స్పందించాలన్న డిమాండ్

శాంతియుతంగా నిరసన తెలియజేయడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని పిటిషనర్ వాదించారు. అలాంటి వ్యక్తి కళ్లముందే ఆకలితో ప్రాణాలు కోల్పోతే అది దేశానికే అవమానమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లే అవుతుందని ఆరోపించారు. ఇదే సమయంలో జంతర్‌మంతర్ ప్రాంతంలోని అధిక శబ్దం తనకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోందని వాంగ్‌చుక్ ఇటీవల వెల్లడించారు. లడఖ్ ప్రశాంత వాతావరణానికి అలవాటైన తనకు అక్కడి శబ్దాన్ని భరించడం కష్టంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతుండగా, ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.