పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు.
ఎన్టీఏలో సమూల మార్పులు.
నీట్, జేఈఈ, క్యూయెట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులకు సిద్ధమైంది. ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసిన నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో ఎన్టీఏను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచి భవిష్యత్తులో లీకేజీలకు అవకాశం లేకుండా కొత్త వ్యవస్థను తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం భావిస్తోంది.
47 మందిపై వేటు, లీకేజీలకు చెక్ పెట్టే చర్యలు
ఎన్టీఏలో పనిచేస్తున్న కనీసం 47 మందిని తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొందరిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోనున్నట్లు సమాచారం. వారి హోదాలపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సంస్థ పనితీరును పూర్తిగా సమీక్షించి సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీ సూచనల ఆధారంగా సంస్థలో సంస్కరణలు అమలు చేయనున్నారు. ఎన్టీఏలో అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. ప్రశ్నాపత్రాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త విధానాలు అమలు చేయనున్నారు. లీకేజీలకు అవకాశం లేకుండా సాంకేతిక భద్రతను బలోపేతం చేయడంతో పాటు పరీక్షల నిర్వహణ ప్రక్రియ మొత్తాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల నిరసనల తర్వాత కేంద్రం తీసుకుంటున్న అత్యంత కీలక చర్యల్లో ఇదొకటిగా భావిస్తున్నారు.
కఠిన చట్టానికి మంత్రివర్గం ఆమోదం
ప్రశ్నాపత్రాల లీకేజీలపై మరింత కఠిన చర్యలకు కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం–2024లో సవరణలు చేయాలని నిర్ణయించింది. వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లకు పాల్పడితే గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా నిబంధనలు తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి జరిమానాను మరింత కఠినతరం చేయనున్నారు. 2017లో ఏర్పాటైన ఎన్టీఏ ప్రస్తుతం నీట్, జేఈఈ, క్యూయెట్ సహా 20కిపైగా జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహిస్తోంది. వరుసగా వెలుగుచూసిన ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల్లో విశ్వాసం దెబ్బతినడంతో కేంద్రం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. పరీక్షల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి, ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యం ఉండే పారదర్శక వ్యవస్థను నిర్మించడం ద్వారా విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
#NTAReforms #PaperLeak #NEETPaperLeak #JEE #CUET #NationalTestingAgency #ExamReforms #PublicExaminationsAct #EducationSystem #DharmendraPradhan #StudentSafety #IndiaEducation











