ఆకలితో హోటల్లో కొనుగోలు చేసిన టిఫిన్… ఇంటికి తీసుకెళ్లి కుటుంబంతో కలిసి తినడం… రుచిగా అనిపించిన చట్నీని మరో ముద్దతో నోటికి తీసుకెళ్లేలోపే కనిపించింది ఒక బల్లి. క్షణాల్లోనే భోజనపు టేబుల్ భయానక దృశ్యంగా మారిపోయింది. అప్పటికే అదే చట్నీ తిన్న మహిళకు వాంతులు మొదలవడంతో కుటుంబ సభ్యుల్లో గందరగోళం నెలకొంది. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశారు. ఒక్క చట్నీలో బల్లి కనిపించడం మాత్రమే కాదు… ఆహార భద్రతపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్నే ఈ ఘటన ప్రశ్నార్థకంగా మార్చింది. ఫిర్యాదు చేసినా ప్రొద్దుటూరు శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్, హోటల్ యాజమాన్యం
నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో స్థానికుల్లో పట్టలేనంత ఆగ్రహం వ్యక్తమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించి హోటల్‌ను సీజ్ చేశారు. ప్రొద్దుటూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తున్న ఆహారం నిజంగా సురక్షితమేనా? హోటళ్లలో పరిశుభ్రత ప్రమాణాలు కేవలం నిబంధనలకే పరిమితమయ్యాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి వినియోగదారుడి మనసులో మెదులుతున్నాయి.
చట్నీలో బల్లి కలకలం
కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్, హోటల్లో విక్రయించిన టిఫిన్ చట్నీలో బల్లి కనిపించిందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. రామేశ్వరం రోడ్డులోని గణేష్ హోటల్ నుంచి కొనుగోలు చేసిన టిఫిన్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆహార భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. టిఫిన్ తిన్న కుటుంబం తీవ్ర ఆందోళనకు గురికావడంతో అధికారులు రంగంలోకి దిగారు.
టిఫిన్ తింటుండగా షాక్
స్థానిక కోనేటి కాల్వ వీధికి చెందిన సోహెల్ శుక్రవారం ఉదయం హోటల్ నుంచి టిఫిన్ పార్శిల్ తీసుకెళ్లాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి టిఫిన్ తింటుండగా చట్నీలో బల్లి కనిపించినట్లు ఆయన తెలిపారు. అప్పటికే అదే చట్నీ తిన్న ఆయన భార్య అస్వస్థతకు గురైంది. వాంతులు ప్రారంభం కావడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

యాజమాన్యంపై నిర్లక్ష్య ఆరోపణ
ఈ విషయాన్ని శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్, హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా బాధ్యతాయుతంగా స్పందించకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు బాధితుడు ఆరోపించారు. దీనిపై వెంటనే ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లోకా సమస్త హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సంస్థ ప్రతినిధులను కలిసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
హోటల్ సీజ్.. కేసు నమోదు
ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు స్పందించారు. కడప–అన్నమయ్య జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారి ఎం. హరితతో కలిసి హోటల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక విచారణలో లభించిన వివరాల ఆధారంగా గణేష్ హోటల్‌ను సీజ్ చేశారు. సంబంధిత ఆహార భద్రత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అవసరమైన నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు.

పరిశుభ్రతపై మళ్లీ ప్రశ్నలు
ఈ ఘటనతో ప్రొద్దుటూరులో ఆహార భద్రతపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. హోటళ్లలో పరిశుభ్రత ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి నాణ్యతలేని ఆహారం విక్రయించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వినియోగదారుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
ప్రొద్దుటూరు
+917337378783











