Home AP మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి

మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి

ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల పండుగలు.
మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి.

పోలవరం ప్రాజెక్టు ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం ఆయన క్షేత్రస్థాయిలో గ్యాప్‌-1, గ్యాప్‌-2 పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం గ్యాప్‌-1 పనులు 49 శాతం, గ్యాప్‌-2 పనులు 43 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. కుడి కనెక్టివిటీని సెప్టెంబర్‌ చివరికి, ఎడమ కనెక్టివిటీని నవంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ పనులకు రూ.536 కోట్ల వ్యయం అవుతోందన్నారు. 2024 జూన్‌ తర్వాత 10,491 ఎకరాల భూసేకరణ చేసి, నిర్వాసితులకు రూ.2,250 కోట్ల పరిహారం అందించినట్లు మంత్రి వివరించారు.

రూ.35 వేల కోట్లతో భారీ ప్రణాళిక

రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నిమ్మల తెలిపారు. హంద్రీనీవా, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ పనులను పూర్తి చేసి నీటిని విడుదల చేశామని చెప్పారు. ఇక రానున్న మూడేళ్లలో పలు ప్రాజెక్టులను వరుసగా పూర్తి చేసి ప్రారంభోత్సవాల పండుగ నిర్వహిస్తామని ప్రకటించారు. పోలవరం పూర్తయితే సాగు, తాగునీటి అవసరాలకు భారీ ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఇరిగేషన్‌ రంగంలో పనులు నెమ్మదించాయని ఆయన విమర్శించారు. ప్రస్తుతం నిర్దేశిత గడువులకు అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.

#AndhraPradesh #IrrigationProjects #36Projects #NimmalaRamanaidu #Polavaram #PolavaramProject #ECRFDam #PolavaramWorks #APIrrigation #WaterResources #HandriNeeva #VeligondaProject #PolavaramLeftCanal #IrrigationDevelopment #APDevelopment