స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం కామన్వెల్త్ గేమ్స్–2026 ప్రారంభోత్సవ వేడుకలకు ఆతిథ్యమిచ్చింది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో సంగీతం, సంస్కృతి, క్రీడా స్ఫూర్తి కలగలిసి ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. గ్రామీ అవార్డు నామినీ కేటీ టన్స్టాల్, ప్రముఖ గాయకుడు టామ్ వాకర్ ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నీనా నెస్బిట్, కాలమ్ బీటీ, నాథన్ ఎవాన్స్, సెయింట్ పీహెచ్ఎన్ఎక్స్, వాల్టోస్ బృందాలు కూడా తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించాయి.
74 దేశాలు, భూభాగాలకు చెందిన క్రీడాకారులు సంప్రదాయ పరేడ్ ఆఫ్ నేషన్స్‌లో పాల్గొని తమ జాతీయ జెండాలతో స్టేడియంలో అడుగుపెట్టారు. ప్రతి కామన్వెల్త్ సభ్య దేశాన్ని సూచించే 74 ప్రత్యేక వేడుకల బ్యాటన్ల ప్రదర్శన మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రీడల అధికారిక మస్కట్ ‘ఫిన్నీ ది యూనికార్న్’ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభోత్సవంతో కామన్వెల్త్ గేమ్స్–2026కు అధికారికంగా తెరలేచింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు పతకాల కోసం పోటీకి సిద్ధమయ్యారు.











