కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
భరోసా యాత్రలో ఘాటు వ్యాఖ్యలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం సింగరేణి ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఈ రెండు పార్టీల పాలనే కారణమని ఆరోపించారు. గతంలో డబ్బులు తీసుకుని బొగ్గు గనులు కేటాయించారని విమర్శించారు. అప్పట్లో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ సింగరేణిని దోచుకుంటోందని ఆరోపించారు.
ఓటు బ్యాంకుగా సింగరేణి
కాంగ్రెస్ హయాంలో జరిగిన బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అనంతరం బొగ్గు బ్లాకుల కేటాయింపులు పారదర్శకంగా జరగాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం వేలం ప్రక్రియ లేకుండానే తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించిందని తెలిపారు. ఈ బ్లాక్‌లో ఉన్న నాణ్యమైన బొగ్గు నిల్వలు సంస్థకు మరో 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఉపయోగపడతాయని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాటు సింగరేణిని ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణికి చేసిన మేలు ఏమిటో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ గురించి బీఆర్ఎస్ ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. సింగరేణిలో ఏ సమస్య వచ్చినా కేంద్రాన్ని సంప్రదించకుండా రాజకీయ ఆరోపణలకే పరిమితమయ్యారని విమర్శించారు.
రూ.24 వేల కోట్ల బకాయిలు
సింగరేణి నుంచి తీసుకున్న బొగ్గు, విద్యుత్ బిల్లులకు సంబంధించిన సుమారు రూ.24 వేల కోట్ల బకాయిలను బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి సంస్థలో 49 శాతం వాటా ఉన్నా అభివృద్ధి కోసం సమర్థంగా ప్రయత్నించలేదన్నారు. కార్మికుల కష్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థకు మరిన్ని బొగ్గు బ్లాకులు అవసరమని తాను పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. సంస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. సింగరేణిని రాజకీయ వేదికగా కాకుండా కార్మికుల జీవనాధారంగా చూడాలని సూచించారు. సంస్థ బలోపేతానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.











