సినీ ప్రపంచానికి తీరని లోటు
78 ఏళ్ల వయసులో తుది శ్వాస
క్యాన్సర్‌పై గెలిచి.. జీవితానికి వీడ్కోలు.
హాలీవుడ్ ప్రముఖ నటుడు, జురాసిక్ పార్క్ చిత్రంలో డాక్టర్ అలన్ గ్రాంట్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సామ్ నీల్ కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయన మరణం ఊహించని విధంగా జరిగిందని తెలిపారు. కొద్ది నెలల క్రితమే రక్త క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించిన సామ్ నీల్ ఆకస్మిక మరణం అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది.
జురాసిక్ పార్క్‌తో చిరస్థాయిగా
స్టేజ్–3 రక్త క్యాన్సర్‌తో కొన్నేళ్లుగా పోరాడిన సామ్ నీల్ ఆధునిక కార్–టి సెల్ చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో తాను క్యాన్సర్ రహితుడినని స్వయంగా ప్రకటించారు. మళ్లీ సినిమాల్లో నటించాలనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే ఆరోగ్యం మెరుగుపడిన కొద్ది నెలల్లోనే ఆయన మరణించడం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. 1947లో ఉత్తర ఐర్లాండ్‌లో జన్మించిన సామ్ నీల్ చిన్న వయసులోనే న్యూజిలాండ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి సినీ ప్రయాణాన్ని ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించారు. స్లీపింగ్ డాగ్స్, మై బ్రిలియంట్ కెరీర్, ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్, ది పియానో వంటి చిత్రాలతో నటుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. 1993లో విడుదలైన జురాసిక్ పార్క్ సినిమాలో డాక్టర్ అలన్ గ్రాంట్ పాత్ర ఆయనకు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తీసుకొచ్చింది. తర్వాత జురాసిక్ పార్క్–3, జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రాల్లో కూడా అదే పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.
ఐదు దశాబ్దాల అద్భుత ప్రస్థానం
సుమారు ఐదు దశాబ్దాల సినీ జీవితంలో 150కు పైగా సినిమాలు, టెలివిజన్ ప్రాజెక్టుల్లో సామ్ నీల్ నటించారు. డెడ్ కామ్, ఈవెంట్ హొరైజన్, ది ట్యూడర్స్, పీకీ బ్లైండర్స్ వంటి అనేక ప్రముఖ చిత్రాలు, సిరీస్‌లలో ఆయన తనదైన ముద్ర వేశారు. డ్రామా, థ్రిల్లర్, హారర్, కమర్షియల్ చిత్రాలు అనే తేడా లేకుండా ప్రతి పాత్రను సహజంగా పోషించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. నటనతో పాటు న్యూజిలాండ్‌లోని తన ద్రాక్ష తోట నిర్వహణలో కూడా సామ్ నీల్ ఆసక్తి చూపేవారు. సామాజిక మాధ్యమాల్లో వ్యవసాయ జీవితం, జంతువులతో గడిపిన క్షణాలను పంచుకుంటూ అభిమానులకు మరింత చేరువయ్యారు. 2022లో నటనకు చేసిన విశేష సేవలకు గాను నైట్‌హుడ్ గౌరవం అందుకున్నారు. ఆయన మరణంపై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తన పిల్లలు, మనవళ్లను విడిచి వెళ్లిన సామ్ నీల్ సృష్టించిన పాత్రలు మాత్రం సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి.











