ఓటు హక్కుపై పాలకుల ఉక్కుపాదం! పరకాల ప్రభాకర్

13

ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా ‘సర్‌’
మేధావి, విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ధ్వజం

ప్రస్తుతం దేశంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌, సర్‌ ప్రక్రియ ఒక తీవ్రమైన రాజకీయ నరమేధమని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ మండిపడ్డారు. అమరావతిలో జరిగిన ఒక ప్రత్యేక సదస్సులో ఆయన పాల్గొని గతంలో తను చెప్పిన ముప్పును మరోసారి నొక్కి చెప్పారు. గతంలో ఓటర్లు పాలకులను ఎన్నుకునేవారని, కానీ ఇప్పుడు ఎవరు ఓటరుగా ఉండాలో పాలకులే నిర్ణయించే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి దాదాపు 6.5 కోట్ల మంది ఓట్లను తొలగించారని ఆయన వెల్లడించారు. ఈ సర్‌ ప్రక్రియ కేవలం ఓటరు జాబితా ప్రక్షాళన కోసం మాత్రమే చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని పరకాల ప్రభాకర్‌ విమర్శించారు. దీని వెనుక ఒక రహస్య అజెండా ఉందని, కేవలం కొన్ని నిర్దిష్ట వర్గాల ఓట్లను తొలగించడమే దీని ప్రధాన లక్ష్యమని ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్‌ ఉదాహరణను చూపిస్తూ.. అక్కడ ముస్లిం జనాభా 17 శాతం ఉంటే, తొలగించిన ఓట్లలో వారి వాటా 33 శాతంగా ఉందని గణాంకాలతో వివరించారు. దేశమంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి సుమారు 16.5 కోట్ల మంది ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు.

హక్కుల రక్షణకు వీధి పోరాటాలే శరణ్యం
గతంలో జరిగిన ఓటర్ల సవరణల్లో ప్రజలు తమ అర్హతలను నిరూపించుకోవడానికి ఎలాంటి పత్రాలు అడగలేదని, కానీ ఇప్పుడు కచ్చితంగా డాక్యుమెంట్లు సమర్పించాలనే నిబంధన పెట్టారని పరకాల ప్రభాకర్‌ చెప్పారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల దళితులు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసీలు, రోజువారీ కూలీలు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని తమ పరిశీలనలో తేలిందని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా దాదాపు 88 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్‌ జరగలేదని ప్రకటించారని, అందులో అత్యధిక ఓట్లు తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు. బిహార్‌లో 63 లక్షల మంది ఓట్లు తొలగించడంపై పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగినా ఎన్నికల సంఘం కనీసం సమీక్ష కూడా చేయకుండా ముందుకు వెళ్తోందని పరకాల విమర్శించారు. దీనివల్ల దేశంలో ఓటు ఉన్నవారు, లేనివారు అనే కొత్త విభజన వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన కూడా దారుణంగా జరుగుతోందని చెప్పారు. ఓటు హక్కును, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వీధి పోరాటాలు ఒక్కటే మార్గమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకుడు జి.ఈశ్వరయ్య, జల్లి విల్సన్‌ తదితరులు పాల్గొని, ‘సర్‌’ పై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరుస్తామని ప్రకటించారు.

 

#ParakalaPrabhakar #VoterRevision #SIR #ElectionCommission #Democracy #VotingRights #Amaravati #PoliticalAnalysis #ElectoralRolls #VoterDeletion #IndiaPolitics #MinorityRights #DalitRights #TelanganaPolitics #BreakingNews