ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేయడానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో ఏర్పడిన మంత్రుల బృందం ఉండవల్లి నివాసంలో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్ తోపాటు ఆన్ లైన్ ద్వారా టీజీ భరత్ పాల్గొన్నారు. ఒక చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద డేటా సెంటర్ వరకు ఏ రకమైన వ్యాపారానికైనా ఒకే ఒక్క సింగిల్ పోర్టల్ ద్వారా అన్ని అనుమతులు మంజూరు చేసే సరికొత్త విధానాన్ని రూపొందించాలని అధికారులను లోకేశ్ ఆదేశించారు.
నెలకు ఒక భూమిపూజ లక్ష్యం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన 750 భారీ పరిశ్రమలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇవి పూర్తిస్థాయిలో పట్టాలెక్కితే యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందుకే ప్రతి నెల ఒక ప్రధాన ప్రాజెక్టుకు భూమిపూజ లేదా ప్రారంభోత్సవం ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. నవంబర్ లో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ నాటికి గరిష్టంగా పరిశ్రమల పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలను ఆకర్షించడానికి దేశ, విదేశాల్లో పెద్దఎత్తున రోడ్ షోల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
పారిశ్రామిక హబ్ గా ఏపీ
అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు భవిష్యత్తులో ఒక పెద్ద స్టీల్ హబ్ గా మారబోతున్నాయని లోకేశ్ పేర్కొన్నారు. కొత్తగా వచ్చే ఉక్కు పరిశ్రమల ముడిసరుకు రవాణా కోసం స్లరీ పైప్ లైన్ ఏర్పాటుపై తగిన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనేవి తమ ప్రభుత్వ ప్రత్యేకతలని వివరించారు. టెక్స్ టైల్ పరిశ్రమలకు బ్యాంకింగ్ ఫెసిలిటీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, భోగాపురం విమానాశ్రయం రానున్న నేపథ్యంలో విశాఖలో పర్యాటక హోటల్ గదులను పెంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కృష్ణబాబు, యువరాజ్, కాటంనేని భాస్కర్ వంటి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#NaraLokesh #AndhraPradesh #APInvestments #EaseOfDoingBusiness #SingleWindowSystem #JobCreation #IndustrialDevelopment #PartnershipSummit #APGovernment #DataCenters #SteelHub #Visakhapatnam #BhogapuramAirport #IndustrialGrowth #AndhraNews











