పవన్‌ను వివాదాల్లోకి లాగితే ఊర్కోవద్దు

11

వైసీపీ కుల, కుట్ర రాజకీయాలు తిప్ప కొట్టండి
మంత్రులకు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వంపై వస్తున్న ప్రతి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని స్పష్టం చేశారు. నేరస్థులను వెనకేసుకొస్తూ రాజకీయం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు.

పవన్ కల్యాణ్‌కు అండగా నిలవాలి
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అనవసర వివాదాల్లోకి లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో కూటమి ఐక్యతను చాటే విధంగా మంత్రులంతా ఒకేతాటిపై నిలబడి స్పందించాలని సూచించారు. కేవలం తమ శాఖలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్క మంత్రి అన్ని ప్రభుత్వ శాఖలపైనా సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

విమర్శలను తిప్పికొట్టే వ్యూహం
డీఎస్సీ లాంటి కీలక అంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజల్లో ఎండగట్టాలని చంద్రబాబు అన్నారు. కర్నూలు ఘటనలో గ్రామస్థులు బహిష్కరించిన వ్యక్తులకు వైసీపా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. అలాగే కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కేసులో ప్రభుత్వ చిత్తశుద్ధిని ఆయన కుటుంబ సభ్యులు నమ్మారని మంత్రులు ఈ సమావేశంలో గుర్తుచేశారు. ఈ విషయంలో కూడా వైసీపా శవరాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. జొన్నగిరి గ్రామాన్ని ఇకపై ‘స్వర్ణ గ్రామం’గా నామకరణం చేయాలని ప్రతిపాదించారు. దీంతోపాటు జూలై 3వ తేదీన కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. పారదర్శకమైన పాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు మంత్రులకు వివరించారు.

 

#ChandrababuNaidu #APCabinetMeeting #AndhraPradeshPolitics #YSRCP #PawanKalyan #NDAAlliance #APDevelopment #KadapaSteelPlant #Amaravati #PoliticalNews #APGovernment #Jonnagiri #GoodGovernance #BreakingNews #AndhraNews