లంకె బిందెల వేటలో రేవంత్… రూ.30 వేల కోట్ల భూములపై కాంగ్రెస్ కన్ను

9

తప్పులు జరిగాయ్..ఇకపై అలా జరగనివ్వను
మెట్రో భూముల వెనుక భారీ కుంభకోణం:కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎజెండా ఎప్పుడూ ఒకేలా ఉంటుందని, ఆయన ఏ పథకం తెచ్చినా దాని వెనుక ఒక పెద్ద స్కామ్ దాగి ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం లంకె బిందెల కోసం తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మెట్రో పరిధిలో సుమారు 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, వాటి మార్కెట్ విలువ దాదాపు రూ.30 వేల కోట్ల వరకు ఉంటుందని వివరించారు. ఆ విలువైన ప్రభుత్వ భూములను తన అన్నదమ్ములకో, బావమరుదులకో లేదా అల్లుడికో కట్టబెట్టేందుకే రేవంత్ రెడ్డి కన్నేశారని మండిపడ్డారు. అందుకోసమే మెట్రోను స్వాధీనం చేసుకుని, ప్రజలపై రూ.14 వేల కోట్ల అదనపు భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు.

ఎయిర్‌పోర్ట్ మెట్రో రద్దు తుగ్లక్ నిర్ణయం
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంతో బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మించిందని కేటీఆర్ గుర్తుచేశారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు సంబంధించి పూర్తి టెండర్ ప్రక్రియను కూడా తామే పూర్తి చేశామన్నారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్ పక్కనే ఎలాంటి భూసేకరణ సమస్యలు లేకుండా రెండేళ్లలోనే పూర్తయ్యేలా తాము ప్రణాళికలు రచిస్తే, రేవంత్ రెడ్డి దాన్ని కావాలనే అడ్డుకున్నారని విమర్శించారు.

మళ్లీ మెట్రో పనులు సాగాలంటే కేసీఆర్ రావాలి
రెండున్నర ఏళ్లు కాలయాపన చేసిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ వేదికగా కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి కొత్త నాటకాలకు తెరలేపారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులు ఆపకుండా ఉంటే ఈ పాటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చేదని స్పష్టం చేశారు. మెట్రో ప్రాజెక్టు మళ్లీ సరైన పట్టాలు ఎక్కాలన్నా, హైదరాబాద్ నగర రవాణా రంగానికి పూర్వవైభవం రావాలన్నా 2028 ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమని కేటీఆర్ స్పష్టం చేశారు.

కార్యకర్తలకు భరోసా ఇచ్చిన గులాబీ దళపతి
శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన గతంలో జరిగిన కొన్ని పొరపాట్లను బహిరంగంగానే అంగీకరించారు. గత ప్రభుత్వ హయాంలో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను ఆశించిన స్థాయిలో పట్టించుకోలేదనే నిజాన్ని తాను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానని చెప్పారు. కానీ ఇకపై అలా జరగనివ్వనని, వచ్చే ఐదేళ్లలో ప్రతి ఒక్క కార్యకర్తకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా ఉండి వారి జీవితాలు మార్చే పూర్తి బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టబోయే ‘డిజిటల్ సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

#KTR #BRS #RevanthReddy #HyderabadMetro #MetroRail #AirportMetro #TelanganaPolitics #KCR #KishanReddy #MetroLandScam #PoliticalNews #BRSMeeting #DigitalMembershipDrive #HyderabadDevelopment #TelanganaNews