Home National_news నేర్చుకునేవారిదే విజయం వేగంగా మారుతున్న ప్రపంచం

నేర్చుకునేవారిదే విజయం వేగంగా మారుతున్న ప్రపంచం


భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేం
మార్పును అందిపుచ్చుకుంటే విజయమే
ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ

నేటి ప్రపంచం వేగంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మరో 20–30 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేరని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలని సూచించారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని జీవితాంతం కొనసాగించాలని, నిరంతరం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

సాధించాలన్న పట్టుద కీలకం

ఐఐటీ ఢిల్లీలో జరిగిన 57వ స్నాతకోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. జీవితంలో కుతూహలాన్ని ఎప్పటికీ కోల్పోవద్దని చెప్పారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన వ్యక్తిని ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. మార్పును చూసి భయపడకుండా దానిని అర్థం చేసుకుని కొత్త నైపుణ్యాలను నేర్చుకునే వారే భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తారని స్పష్టం చేశారు. “నేర్చుకునేవారే గెలుస్తారు” అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు. ధైర్యంగా కొత్త పరిష్కారాలను వెతికే వారికి సవాళ్లు అవకాశాలుగా మారతాయని మోదీ అన్నారు. కొత్త పరిస్థితులను స్వీకరించే గుణం ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు నేర్చుకున్న ముఖ్యమైన అంశాల్లో ఒకటని పేర్కొన్నారు. ప్రపంచం మారుతున్న వేగానికి అనుగుణంగా ఆలోచనల్లో కూడా మార్పు రావాలని సూచించారు.

టెక్నాలజీతో మారుతున్న ప్రపంచం

ప్రపంచ శక్తి సమీకరణాలు ప్రతి క్షణం మారుతున్నాయని మోదీ చెప్పారు. దీనికి ప్రధాన కారణం సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందడమేనని వివరించారు. కృత్రిమ మేధస్సు సహా కొత్త టెక్నాలజీ రంగాల్లో ఐఐటీ ఢిల్లీ కీలక కార్యక్రమాలను ప్రారంభించిందని తెలిపారు. యువత కొత్త టెక్నాలజీలను అవకాశాలుగా మార్చుకోవాలని సూచించారు. ప్రతి రంగంలో భారత్‌ను స్వయం సమృద్ధిగా మార్చేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని తెలిపారు. దేశంలో యువత కోసం కొత్త రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ ముందుకు సాగుతున్న తీరును ప్రస్తావించారు. భారత్‌లో సెమీకండక్టర్ ఉత్పత్తి ప్రారంభమైందని, భవిష్యత్తులో చిప్స్ నుంచి షిప్స్ వరకు అన్నీ దేశంలోనే తయారయ్యే స్థాయికి చేరుకుంటామని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో 3,000 మందికి పైగా విద్యార్థులు డిగ్రీలు అందుకున్నారు. వీరిలో 587 మంది పీహెచ్‌డీ పరిశోధకులు ఉన్నారు.

 

#PMModi #NarendraModi #IITDelhi #IITDelhiConvocation #IITDelhi57thConvocation #ModiSpeech #LearnAndAdapt #FutureSkills #ArtificialIntelligence #AI #Technology #SemiconductorIndia #Youth #HigherEducation #IndiaTechnology #SelfReliantIndia #IITGraduates