Home National_news ఈఎంఐల రూపంలో పార్టీ ఫండ్స్‌

ఈఎంఐల రూపంలో పార్టీ ఫండ్స్‌

డీఎంకేపై సీఎం విజయ్ ఆరోపణలు .
సర్కారియా రిపోర్ట్‌.. ఈడీ పత్రాలతో దాడి.

తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. డీఎంకే గత పాలనలో పార్టీ ఫండ్స్‌ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసిందని సీఎం ఆరోపించారు. అవినీతి ఆరోపణలకు ఆధారంగా దశాబ్దాల నాటి సర్కారియా కమిషన్‌ నివేదికను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పత్రాలను ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో పార్టీ ఫండ్స్‌ పేరుతో కాంట్రాక్టు విలువలో 7.5 నుంచి 10 శాతం వరకు వసూలు చేశారన్న ఈడీ పత్రాల్లోని అంశాలను విజయ్‌ సభలో ప్రస్తావించారు. ఈ వసూళ్లు లోన్‌ ఈఎంఐల్లా విడతల వారీగా లంచాలు తీసుకున్నట్టుగా ఉన్నాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో ఎం.కె. స్టాలిన్‌, ఉదయనిధి స్టాలిన్‌, సెంథిల్‌ బాలాజీ నేరుగా లబ్ధిదారులుగా ఉన్నారని ఈడీ పేర్కొన్నట్లు విజయ్‌ తెలిపారు. ఇవి తన వ్యక్తిగత ఆరోపణలు కావని, అధికారిక పత్రాల్లో ఉన్న అంశాలను మాత్రమే సభ ముందుంచుతున్నానని స్పష్టం చేశారు. రతీష్‌ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించిన విజయ్‌.. ఆయన దుబాయ్‌లో ఎందుకు ఉన్నారని, గత ప్రభుత్వంతో ఆయనకు ఉన్న సంబంధాలేంటని ప్రశ్నించారు.

మహిళలపై వ్యాఖ్యలకు చెక్‌

అసెంబ్లీలో మహిళల గౌరవం అంశాన్ని కూడా విజయ్‌ బలంగా ప్రస్తావించారు. మహిళలపై నేరాలు, పిల్లలపై దాడులు, డ్రగ్స్‌ ముప్పుపై ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. నేరం చేసిన వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడైనా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు. మహిళలను ఉద్దేశించి డబుల్‌ మీనింగ్‌ వ్యాఖ్యలు చేయడం ఆపాలని సూచించారు. “మహిళల గురించి మాట్లాడే ముందు మీ ఇంట్లోని మహిళలను గుర్తు చేసుకోండి” అనే రీతిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇటీవలి రాజకీయ వివాదాలకు సంబంధించి చేసినవిగా భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డీఎంకే చేస్తున్న విమర్శలను విజయ్‌ తిప్పికొట్టారు. గత మూడు నెలల్లో జరిగిన అనేక నేరాలు పాత కక్షలు, ప్రతీకార ఘటనల కారణంగానే జరిగాయని వివరించారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెబుతూ.. పోలీసులు ప్రజలకు రక్షకులుగా ఉండాలి, అధికార కేంద్రంగా మారకూడదని అన్నారు. చట్టాన్ని గౌరవించే వారికి పోలీసులు మిత్రులుగా, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కఠినంగా ఉండాలని సూచించారు. కోయంబత్తూరులో కాలేజీ విద్యార్థి హత్య కేసులో 36 మందిని అరెస్టు చేసినట్లు కూడా సభకు వెల్లడించారు.

డీఎంకే వాకౌట్‌.. బయట ఎదురుదాడి

విజయ్‌ ఆరోపణలతో డీఎంకే సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ పోడియం చుట్టూ చేరి నిరసన చేపట్టి, సభ నుంచి వాకౌట్‌ చేశారు. వెంటనే తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేసినా స్పీకర్‌ తొలుత అనుమతించలేదు. పరిస్థితుల నేపథ్యంలో అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని స్పీకర్‌ స్పష్టం చేయడంతో డీఎంకే సభ్యులు బయటకు వెళ్లారు. అనంతరం ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ విజయ్‌ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాత విషయాలను ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. “నేటి హత్యలు, శాంతిభద్రతలపై ప్రశ్నిస్తే.. విజయ్‌ 1960లు, 1970ల నాటి అంశాలు మాట్లాడుతున్నారు” అంటూ ఎద్దేవా చేశారు. సర్కారియా కమిషన్‌, ఈడీ ప్రస్తావనలు కేవలం ఆరోపణలేనని పేర్కొన్నారు. విజయ్‌ తమ ప్రభుత్వ గత మూడు నెలల పనితీరు, భవిష్యత్‌ ప్రణాళికలపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. డీఎంకే అధికార ప్రతినిధి సరవణన్‌ అన్నాదురై కూడా విజయ్‌పై ఎదురుదాడి చేశారు. మొత్తంగా సభలో విజయ్‌ చేసిన అవినీతి ఆరోపణలు.. డీఎంకే నిరసన, వాకౌట్‌తో తమిళ రాజకీయాల్లో కొత్త పోరుకు తెరతీశాయి. ప్రభుత్వం వర్సెస్‌ ప్రతిపక్షం పోరు ఇప్పుడు గత అవినీతి ఆరోపణల నుంచి ప్రస్తుత శాంతిభద్రతలు, పాలనా వైఫల్యాల వరకు విస్తరించే పరిస్థితి కనిపిస్తోంది.

 

#Vijay #TVKVijay #TamilNaduPolitics #TamilNaduAssembly #DMK #DMKCorruption #VijayVsDMK #CorruptionAllegations #PartyFunds #SarkariaCommission #EDDocuments #MKStalin #UdhayanidhiStalin #SenthilBalaji #DMKWalkout #TamilPolitics #TVK #LawAndOrder #TamilNaduGovernment #PoliticalBattle