ప్రొద్దుటూరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాచమల్లు ఏ పని అయినా డబ్బులు తీసుకోకుండా చేసేవారు కాదంటూ ఆరోపించారు. ఆర్డీవో, ఆదాయపు పన్ను శాఖ అధికారుల పేర్లు చెప్పి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలు ప్రజలకు తెలుసని అన్నారు. గతంలో ఎన్నో సందర్భాల్లో పోలీసులు చర్యలు తీసుకోకుండా తానే కాపాడానని, ఇప్పుడు తనపైనే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. తనపై ఒక్క తప్పు జరిగినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. తాను అవినీతి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రాచమల్లుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే చేసిన తాజా వ్యాఖ్యలతో ప్రొద్దుటూరు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.












