పాకిస్తాన్‌కు దోవల్ ఘాటు వ్యాఖ్యలు.
ఆపరేషన్ సిందూర్‌పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఔదార్యం, సహనం బలహీనతగా భావించొద్దని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రధాన లక్ష్యం శత్రు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమేనని వెల్లడించారు. ముఖ్యంగా పహల్గామ్ దాడికి బాధ్యులైన ఉగ్రవాదుల శిబిరాలనే లక్ష్యంగా ఎంచుకున్నామని తెలిపారు. మే 7న ప్రారంభమైన ఈ సైనిక చర్యలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర మౌలిక వసతులపై భారత్ కచ్చితమైన దాడులు చేసింది.
ఎంతటి ముప్పైనా వెనకడుగు లేదు
ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చిందని దోవల్ చెప్పారు. భారత్ సహనాన్ని బలహీనతగా చూస్తే పొరపాటేనని హెచ్చరించారు. దేశ భద్రతకు ముప్పు ఎదురైతే ఎంతటి పరిణామాలు ఎదురైనా ప్రమాదాన్ని స్వీకరించి గట్టిగా దెబ్బకొట్టే సామర్థ్యం భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ నుంచి ప్రతిదాడులు జరిగిన తర్వాత కూడా భారత సైన్యం వరుసగా ప్రతిఘటన చర్యలు చేపట్టింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన రెండు దేశాల మధ్య దాదాపు 88 గంటల పాటు ఉద్రిక్త సైనిక ఘర్షణ కొనసాగిన తర్వాత మే 10 సాయంత్రం ఇరు దేశాల మధ్య అవగాహనతో పోరాటం నిలిచిపోయింది.
తొలిసారి దోవల్ పూర్తి వివరణ
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి దోవల్ ఈ స్థాయిలో తన అనుభవాలను పంచుకున్నారు. డిస్కవరీ రూపొందించిన ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్’ డాక్యుమెంటరీలో ఆయనతో పాటు సైనిక, జాతీయ భద్రతా రంగానికి చెందిన కీలక అధికారులు ఆపరేషన్ వెనుక నిర్ణయాలను వివరించారు. ఆపరేషన్ లక్ష్యాలు, వ్యూహం, భారత్ తీసుకున్న నిర్ణయాలపై ఇందులో వివరాలు వెల్లడించనున్నారు. ఆగస్టు 15 రాత్రి 9 గంటలకు డిస్కవరీ, డిస్కవరీ+లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న సంకల్పాన్ని ఈ కార్యక్రమం ప్రపంచానికి వివరించనుంది.
#AjitDoval #OperationSindoor #Pakistan #IndiaPakistan #PahalgamAttack #IndianArmy #NationalSecurity #Terrorism #India #OperationSindoorDocumentary











