బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులను “క్రిమినల్ వేస్ట్”గా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశ అభివృద్ధిలో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర అమూల్యమని పేర్కొంటూ, వారిని అవమానించడం దేశ యువతను అవమానించడమేనని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై మౌనం పాటించడం ద్వారా రాహుల్ గాంధీ కూడా రాజకీయ, నైతిక బాధ్యత నుంచి తప్పించుకోలేరని కేటీఆర్ లేఖలో స్పష్టం చేశారు.
రేవంత్‌పై తీవ్ర విమర్శలు
రేవంత్ రెడ్డి గతంలో కూడా విద్యార్థులను “బీర్ అండ్ బిర్యానీ బ్యాచ్”గా, విద్యార్థి ఉద్యమాలను “గూండాల పని”గా అభివర్ణించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఉపాధ్యాయులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రశ్నించే వారిని సమాధానాలతో కాకుండా అవమానాలతో ఎదుర్కొంటోందని విమర్శించారు. యువత గౌరవాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ ముందుగా తన ప్రభుత్వంలో ఆ విలువలను అమలు చేయాలని రాహుల్ గాంధీకి సూచించారు.
కేటీఆర్ మూడు ప్రధాన డిమాండ్లు
ఈ లేఖలో కేటీఆర్ మూడు కీలక డిమాండ్లు చేశారు. మొదటగా, రాహుల్ గాంధీ దేశంలోని ప్రతి విద్యార్థి, ఇంజినీర్, ఉపాధ్యాయుడు, యువతకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. రెండోగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వెంటనే బేషరతు క్షమాపణ చెప్పించి, ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలాంటి సమర్థన లేకుండా బహిరంగంగా ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు. మూడోగా, రాజకీయ మాటల స్థానంలో జవాబుదారీతనం ఉండాలని, రేవంత్ వ్యాఖ్యలను సమర్థించడం అవమానాన్ని సమర్థించినట్టేనని, మౌనం దానికి ఆమోదం తెలిపినట్టేనని హెచ్చరించారు.
యువతే తుది తీర్పు ఇస్తుంది
తెలంగాణ యువత అన్నింటినీ గమనిస్తోందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. విరిగిన హామీలు, నమ్మకద్రోహాలు, యువత ఆకాంక్షలను అవమానించిన ప్రతి వ్యాఖ్య ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు. రాజకీయ అధికారం శాశ్వతం కాదని, మేల్కొన్న యువత ప్రజాస్వామ్య వేదికపై ఓటుతో తమ తీర్పు చెబుతుందని రాహుల్ గాంధీకి హెచ్చరించారు. నాయకత్వం ప్రత్యర్థులను విమర్శించడంలో కాదని, సొంత పార్టీ తప్పులను సరిదిద్దడంలోనే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
#KTR #KTRamaRao #RahulGandhi #RevanthReddy #BRS #Congress #TelanganaPolitics #EngineeringStudents #Students #TelanganaYouth #KTRLetter #PoliticalControversy #ApologyDemand #StudentRights #TelanganaNews











