Home Telangana కేబీఆర్‌ ట్రాఫిక్‌కు భారీ ఊరట

కేబీఆర్‌ ట్రాఫిక్‌కు భారీ ఊరట


వన్‌వేతో మారనున్న రూట్లు..
ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో పరిష్కారం.
రూ.1,090 కోట్లతో భారీ ప్రాజెక్టు.

హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌-సిటీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా కేబీఆర్‌ పార్క్ చుట్టూ ఉన్న కీలక జంక్షన్లలో రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో 7 మల్టీ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్లు, 7 డైరెక్షనల్ అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. మొత్తం 14 నిర్మాణాలతో కేబీఆర్‌ కారిడార్‌ను సిగ్నల్‌ రహితంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు ఈ నెల 18 నుంచి కేబీఆర్‌ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. రెండు విడతల ట్రయల్ రన్స్ నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ తెలిపారు. వాహనదారులకు తొలి రోజుల్లో కొంత ఇబ్బంది ఎదురైనా, భవిష్యత్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

ఫ్లైఓవర్లు.. అండర్‌పాస్‌లతో సిగ్నల్‌ ఫ్రీ

హెచ్‌-సిటీ ప్రాజెక్టును 24 నెలల కాలపరిమితితో చేపడుతున్నారు. కేబీఆర్‌ పరిసరాల్లోని ఆరు ప్రధాన జంక్షన్లను రెండు ప్యాకేజీలుగా అభివృద్ధి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్‌ పార్క్ ఎంట్రెన్స్, ముగ్ధ జంక్షన్‌ ఒక ప్యాకేజీలో ఉండగా.. రోడ్‌ నంబర్‌ 45, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్, బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్లు మరో ప్యాకేజీలో ఉన్నాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్‌ ఎంట్రెన్స్ ప్రాంతాల్లో కీలకమైన అండర్‌పాస్‌లు, స్టీల్‌ ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. రోడ్‌ నంబర్‌ 45, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్, బసవతారకం జంక్షన్లలోనూ నేరుగా వెళ్లే ట్రాఫిక్‌కు అండర్‌పాస్‌లు, రైట్‌ టర్నింగ్‌ వాహనాలకు ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తారు. దీంతో ఒక్కో దిశలోని వాహన ప్రవాహాన్ని విడదీసి రద్దీ తగ్గించనున్నారు.

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ టాప్‌

కేబీఆర్‌ కారిడార్‌లో ట్రాఫిక్‌ తీవ్రత ఎంత ఉందో పీక్‌ అవర్‌ గణాంకాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌ వద్ద గంటకు 15,321 పీసీయూల రద్దీ నమోదవుతోంది. కేబీఆర్‌ పార్క్‌ ఎంట్రెన్స్‌లో 13,516 పీసీయూలతో రెండోస్థానంలో ఉంది. మహారాజా అగ్రసేన్‌ జంక్షన్‌లో 10,356, రోడ్‌ నంబర్‌ 45 వద్ద 9,966, ఫిలింనగర్‌లో 9,605, బసవతారకం జంక్షన్‌లో 5,880 పీసీయూల ట్రాఫిక్‌ నమోదవుతోంది. హెచ్‌-సిటీ పనులు పూర్తయితే కేబీఆర్‌ ఎంట్రెన్స్, రోడ్‌ నంబర్‌ 45, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్లలో ట్రాఫిక్‌ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని సజ్జనార్‌ తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌ వద్ద సుమారు 80 శాతం ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయని చెప్పారు.

ఇంధనం ఆదా.. కాలుష్యానికి చెక్

సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచిపోయే సమయం తగ్గడంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఇంధన వినియోగం తగ్గడంతో ప్రజలకు ఆర్థిక ప్రయోజనం కలగడంతో పాటు కేబీఆర్‌ పరిసరాల్లో కార్బన్‌ ఉద్గారాలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. కోర్‌ సిటీ నుంచి ఐటీ కారిడార్‌ వైపు ప్రయాణించే వారికి ఈ ప్రాజెక్టు పెద్ద ఊరటగా మారనుంది. నిర్మాణ పనుల సమయంలో వన్‌వే కారణంగా రూట్లు మార్చుకోవాల్సి రావడంతో వాహనదారులకు కొంత ఇబ్బంది తప్పదు. అయితే ఈ తాత్కాలిక అసౌకర్యం భవిష్యత్‌లో సిగ్నల్‌ రహిత, వేగవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తుందని పోలీసులు చెబుతున్నారు. నిర్మాణ పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని, నగరవాసులు సహకరించాలని సజ్జనర్‌ విజ్ఞప్తి చేశారు.

 

#KBRPark #HyderabadTraffic #HCITYProject #KBRTraffic #HyderabadInfrastructure #KBRFlyovers #KBRUnderpasses #JubileeHills #HyderabadRoads #TrafficRelief #SignalFreeCorridor #SteelFlyovers #DirectionalUnderpasses #VCSajjanar #TelanganaNews