నీరు పల్లమెరుగు… నిజం దేవుడెరుగు

70

అత్యాధునిక సాంకేతికతతో అంతరిక్షాన్ని సైతం జల్లెడ పడుతున్నామని గొప్పలు చెప్పుకునే మన ఆధునిక సమాజంలో… కేవలం మూడేళ్ల పసిపాప అడవిలో అదృశ్యమైతే ఒక్క అడుగుజాడ కూడా కనిపెట్టలేకపోవడం దేనికి నిదర్శనం? డ్రోన్ కెమెరాలు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, వందలాది మంది పోలీసులు, జాగిలాలు… ఇన్ని వ్యవస్థలు రంగంలోకి దిగినా పద్దెనిమిది రోజులుగా చిన్నారి జాహ్నవి ఆనవాళ్లు లభించకపోవడం మన వ్యవస్థల డొల్లతను సూటిగా ప్రశ్నిస్తోంది. భద్రతా వ్యవస్థల పటిష్టత కేవలం కాగితాలకే పరిమితమా? పాపకు తోడుగా వెళ్లిన మూగజీవి.. కుక్క తిరిగివచ్చి ప్రాణాలు వదిలేసింది తప్ప, ఆ అడవి గర్భంలో ఏం జరిగిందో లోకానికి చెప్పలేకపోయింది. ఈ వ్యవహారంలో ప్రకృతి ఏదైనా కఠినమైన యాక్షన్ తీసుకుందా? మనిషి అహాన్ని అణచివేసేలా అడవులు, లోయలు ఆ పసికందును తమలో దాచుకున్నాయా? క్రూరమృగాల దాడి జరిగిందా.. లేక మనుషుల రూపంలో ఉన్న రాక్షసుల పంజాలో ఆ పసిప్రాణం చిక్కుకుందా? ఇది కేవలం ఒక కుటుంబ విషాదం కాదు.. ఒక పసిదానికే రక్షణ కల్పించలేని మన పౌర సమాజానికి, నిస్సహాయంగా మిగిలిపోయిన వ్యవస్థలకు అతిపెద్ద చెంపపెట్టు. ఇంతకీ ప్రకృతి దాచిన ఆ కన్నీటి రహస్యం ఏమిటి? జాహ్నవి ఏమైంది?

Full Story
కొన్ని సంఘటనలు వార్తలుగా మొదలై… కాలక్రమంలో ఒక కుటుంబం ఆవేదనగా, ఒక గ్రామం వేదనగా, ఒక సమాజం ఆత్మపరిశీలనగా మారిపోతాయి. ప్రస్తుతం చిన్నారి జాహ్నవి అదృశ్యం అలాంటి సంఘటనగానే నిలిచింది. రోజులు గడుస్తున్నా, గాలింపులు కొనసాగుతున్నా, అనుమానాలు పుట్టుకొస్తున్నా, ఒక చిన్నారి జాడ మాత్రం దొరకకపోవడం రాష్ట్రవ్యాప్తంగా కలవరాన్ని రేకెత్తిస్తోంది. మూడేళ్లు కూడా నిండని పసిపాప ఒక్కసారిగా అదృశ్యమవడం, పద్దెనిమిది రోజులుగా ఎలాంటి స్పష్టమైన ఆనవాళ్లు లభించకపోవడం ఈ ఘటనను మరింత మర్మంగా మార్చింది. తప్పటడుగులు వేస్తూ ఇంటి చుట్టూ తిరిగే వయసు. ముద్దు ముద్దుగా మాటలు చెబుతూ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తే వయసు. పొలం పనులకు వెళ్లి అలసిపోయి వచ్చిన తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే వయసు. అలాంటి చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోవడంతో ఒక కుటుంబం జీవితం ఒక్కసారిగా శూన్యంగా మారిపోయింది. ఇంట్లో వినిపించాల్సిన పాప నవ్వులు ఇప్పుడు కన్నీటి నిశ్శబ్దంగా మారాయి. ప్రతి అడుగులోనూ ఆమె జ్ఞాపకాలే. ప్రతి క్షణంలోనూ ఆమె కోసం ఎదురుచూపులే.

విశ్వాసానికి మరణం.. పసిప్రాణం కోసం ప్రార్థన
ఈ ఘటనలో ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించిన విషయం ఆమెతో పాటు తిరిగే పెంపుడు శునకం కథ. జాహ్నవి కనిపించకుండా పోయిన రోజున అది కూడా కనిపించలేదు. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చింది. కానీ తన చిన్న యజమానురాలు మాత్రం కనిపించలేదు. ఆ శునకం ఎక్కడికి వెళ్లింది? ఏమి చూసింది? ఏమి వెతికింది? అన్నది ఎవరికి తెలియదు. అయితే తిరిగి వచ్చిన కొద్దిరోజులకే అది కూడా కన్నుమూయడం ఈ విషాదానికి మరో భావోద్వేగ కోణాన్ని జోడించింది. ఒక జంతువు చూపించిన ఆ అనుబంధం చూసి, కన్నతల్లి గుండె ఎంతగా తల్లడిల్లుతుందో అర్థం చేసుకోవచ్చు. జాహ్నవి కోసం ప్రార్థించని హృదయం ఉండకపోవచ్చు. గ్రామాల నుంచి పట్టణాల వరకు, దేవాలయాల నుంచి మసీదులు, చర్చిల వరకు ఒకటే ప్రార్థన వినిపిస్తోంది. “పాప క్షేమంగా దొరకాలి.” ఈ ఘటనలో రాజకీయాలు లేవు. ప్రాంతీయత లేదు. కేవలం ఒక చిన్నారి సురక్షితంగా తిరిగి రావాలన్న మానవీయ ఆకాంక్ష మాత్రమే ఉంది.

ఆధారాలు లేని వేట.. అంతుచిక్కని అనుమానాలు
ఇలాంటి ఘటనల్లో సాధారణంగా ఏదో ఒక ఆధారం లభిస్తుంది. అడుగుజాడలు, వస్తువులు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం లేదా ఇతర ఆనవాళ్లు దర్యాప్తుకు దోహదపడతాయి. కానీ జాహ్నవి కేసులో ఇప్పటివరకు అలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. ఇదే దర్యాప్తును క్లిష్టతరం చేస్తోంది. పోలీసులు, అటవీశాఖ, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, స్పెషల్ డాగ్ సెల్స్, డ్రోన్ల సాయంతో విస్తృతంగా గాలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. కొండలు, గుట్టలు, లోయలు, చెట్టు-పుట్టలు, అడవులు అన్నీ జల్లెడ పడుతున్నా జాహ్నవి జాడ మాత్రం తెలియడం లేదు. ఈ నేపథ్యంలో సహజంగానే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడవిలోని క్రూర మృగాల దాడి జరిగి ఉంటుందా? పులులు లేదా ఇతర జంతువులు పాపను తీసుకెళ్లి ఉంటాయా? అనే ప్రశ్నలు వచ్చాయి. కానీ వాటికి బలం చేకూర్చే ఆనవాళ్లు దొరకలేదు. మరికొందరు భారీ కొండ చీలువలేమైనా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అవి కూడా నిర్ధారణ లేని ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. ఈ కేసులో ప్రతి అనుమానం కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తోంది తప్ప స్పష్టమైన సమాధానాలను ఇవ్వడం లేదు.

మూఢనమ్మకాల జోరు.. వాస్తవాల కోసం అన్వేషణ
ఇలాంటి సందర్భాల్లో మూఢనమ్మకాలు కూడా చోటు చేసుకోవడం దురదృష్టకరం. మాయలు, మంత్రాలు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం పేరుతో అనేక వాదనలు వినిపించాయి. పాప ఈ ప్రాంతంలో ఉందని, ఆ దిశలో ఉందని చెప్పినవారు కూడా ఉన్నారు. కానీ వాస్తవానికి అవన్నీ ఆధారరహిత ప్రచారాలుగానే మిగిలిపోయాయి. ఇలాంటి సందర్భాల్లో భావోద్వేగాలకు లోనుకాకుండా, వాస్తవాలను ఆధారంగా చేసుకున్న దర్యాప్తుకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరో కోణం చర్చకు వస్తోంది. జాహ్నవి అదృశ్యమైన ప్రాంతానికి సమీపంలోని అడవుల్లో సంచార జాతుల వారు తిరుగుతుంటారనే సమాచారం నేపథ్యంలో, వారిలో ఎవరైనా పాపను తీసుకెళ్లి ఉంటారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఇది కూడా కేవలం ఒక అనుమానం మాత్రమే. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు బయటపడలేదు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థలు ప్రతి కోణాన్ని పరిశీలించడం అవసరం. ఎందుకంటే ఈ కేసులో ఏ చిన్న సమాచారం అయినా కీలకంగా మారే అవకాశం ఉంది.

పాప కోసం ఎదురుచూపులు… సమాజానికి హెచ్చరిక
అయితే ఈ అనుమానాలన్నింటి మధ్య ఒక ఆశ మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఒకవేళ ఎవరైనా పాపను తీసుకెళ్లి ఉంటే, ఆమె క్షేమంగా ఉండే అవకాశం ఉంది. అదే ఆశ జాహ్నవి తల్లిదండ్రులను ఇంకా నిలబెడుతోంది. ప్రతి ఉదయం తలుపు వైపు చూసే తల్లి కళ్లలో అదే ఆశ కనిపిస్తుంది. ప్రతి శబ్దంలో తన కుమార్తె అడుగుల చప్పుళ్లు వెతికే తండ్రి హృదయంలో అదే ఆశ కొట్టుకుంటోంది. ప్రతి రోజు కొత్త సమాచారం వస్తుందేమోనన్న ఎదురుచూపుతో మొదలై, మరో నిరాశతో ముగుస్తోంది. ఒక చిన్నారి అదృశ్యం కేవలం ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు. అది సమాజానికి ఒక హెచ్చరిక. పిల్లల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేసే సంఘటన. అత్యవసర పరిస్థితుల్లో స్పందన వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేయాలి అన్న దానిపై ఆలోచింపజేసే ఘటన. ప్రతి చిన్నారి సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించడం కుటుంబాలకే కాదు, సమాజానికీ, ప్రభుత్వ వ్యవస్థలకూ సమాన బాధ్యత అని గుర్తు చేసే సందర్భం.

అంతుచిక్కని నిజం.. రహస్యం గుట్టువీడేనా?
ఇప్పటికీ జాహ్నవి కథకు ముగింపు రాలేదు. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచే ప్రతి రోజూ ఆశను, ఆవేదనను, అనుమానాలను, ప్రార్థనలను వెంట తీసుకెళ్తోంది. “నీరు పల్లమెరుగు… నిజం దేవుడెరుగు” అనే సామెత ఇలాంటి సందర్భాల్లో మరింత అర్థవంతంగా అనిపిస్తుంది. ప్రవాహం ఎటు వెళ్లిందో నీటికి తెలిసినట్లే, ఈ ఘటన వెనుక దాగి ఉన్న నిజం కూడా ఎప్పటికైనా వెలుగులోకి రావాల్సిందే. ఆ నిజం కోసం ఒక తల్లి కన్నీరు ఎదురుచూస్తోంది. ఒక తండ్రి ఆశతో నిలబడి ఉన్నాడు. ఒక గ్రామం ప్రార్థిస్తోంది. ఒక రాష్ట్రం నిరీక్షిస్తోంది. జాహ్నవి ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని, ఆమె మళ్లీ తన తల్లిదండ్రుల ఒడిలోకి చేరాలని, ఆ చిన్నారి చిరునవ్వు మళ్లీ ఇంటి ముంగిట వెలుగులు నింపాలని కోరుకోవడం తప్ప ఈ క్షణంలో మరేమీ చేయలేని పరిస్థితి. ఈ పద్దెనిమిది రోజుల నిరీక్షణకు ముగింపు రావాలి. ఆ ముగింపు విషాదానికి కాదు, ఆశకు చిరునామా కావాలి. ఎందుకంటే ప్రతి చిన్నారి చిరునవ్వు ఒక కుటుంబానికి ప్రపంచం. జాహ్నవి తిరిగి రావడం ఆ కుటుంబానికే కాదు, ఈ ఘటనను గుండెల్లో మోస్తున్న ప్రతి మనసుకూ ఒక ఉపశమనం అవుతుంది. అప్పటి వరకు ఈ ఎదురుచూపు కొనసాగుతూనే ఉంటుంది. నిజం వెలుగులోకి వచ్చే వరకు… జాహ్నవి జాడ తెలిసే వరకు.

 

#Jahnavi #MissingGirl #JahnaviMissingCase #ChildSafety #MissingChild #AndhraPradesh #SearchOperation #NDRF #PoliceInvestigation #Humanity #PrayForJahnavi #BreakingNews #SpecialStory #SocialAwareness #ChildProtection