పూర్తి కాలం పదవిలో ఉంటారా?
కేబినెట్ ప్రక్షాళన, ఆ తర్వాత.
అసెంబ్లీకి కొత్త స్పీకర్ వస్తారా?
ఆ వ్యాఖ్యల వెనుక లెక్కేంటి?
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా, ఎన్టీఆర్ కాలం నుంచి పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. 70 ఏళ్లు దాటిన తనకు గతంలో ఉన్నంత శక్తి లేదని, ఎక్కువగా తిరిగే పరిస్థితి లేదని, మరో మూడేళ్ల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని అయ్యన్న చెప్పడం సాధారణ వ్యాఖ్యగానే కనిపించినా.. దీని వెనుక భవిష్యత్ రాజకీయ లెక్కలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా 2029లో ఎన్డీఏ ప్రభుత్వ పదవీకాలం ముగిసే సమయానికి తాను రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ఆయన చెప్పడం కీలకంగా మారింది. ఇన్నేళ్లు పార్టీ కోసం పనిచేసిన తాను ఇక ప్రశాంతంగా రిటైర్ కావాలనుకుంటున్నాననే సంకేతాన్ని అయ్యన్న ఇచ్చారు. దీంతో అయ్యన్నకు ఇప్పుడే రాజకీయంగా ఎర్త్ పెట్టారా? లేక ఆయనే స్వచ్ఛందంగా తప్పుకునేందుకు సిద్ధమయ్యారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
పునర్‌వ్యవస్థీకరణలో కొత్త స్పీకర్?
అయ్యన్న 2029 వరకు కొనసాగి, ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకోవడం మరో కోణాన్ని ముందుకు తెస్తోంది. అసెంబ్లీ స్పీకర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించడం ఆయనకు గౌరవప్రదమైన ముగింపుగా భావిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఆయన కుమారుడు విజయ్‌కు టీడీపీ రాజ్యసభ అవకాశం కల్పించడం కూడా ఈ కుటుంబానికి పార్టీ నాయకత్వం ఇచ్చిన ప్రాధాన్యతను చూపిస్తోంది. పార్టీ సోషల్ మీడియా వ్యవహారాల్లో కీలకంగా పనిచేసిన విజయ్‌కు పదవి దక్కడంతో తండ్రి–కొడుకుల రాజకీయ ప్రస్థానానికి కొత్త సమీకరణ ఏర్పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో పార్టీ పునర్‌వ్యవస్థీకరణ జరిగితే అయ్యన్న స్థానంలో కొత్త వ్యక్తిని స్పీకర్‌గా తీసుకొచ్చే ఆలోచన ఇప్పటి నుంచే మొదలైందా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే అయ్యన్న వ్యాఖ్యలు మాత్రం ఇప్పటివరకు స్వచ్ఛంద రాజకీయ విరమణపైనే ఉన్నాయి. 2029 వరకు స్పీకర్‌గా కొనసాగుతారా, అంతకుముందే మార్పు జరుగుతుందా అన్నది మాత్రం టీడీపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
#AyyannaPatrudu #ChintakayalaAyyannaPatrudu #AyyannaRetirement #TDP #TDPPolitics #AndhraPradeshPolitics #APAssemblySpeaker #SpeakerChange #CabinetReshuffle #TDPReorganization #VijayChintakayala #2029APElections #TeluguDesamParty











